రోజా వాహనాన్ని అడ్డుకున్నఅమరావతి రైతులు
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు అమరావతి సెగ తగిలింది. ఆమె వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనాన్ని అడ్డుకున్నారు. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. భూములు ఇచ్చిన రైతులు పెయిడ్ ఆర్టిస్ట్ లు కాదంటూ నినదించారు. పోలీసులు రంగంలోకి దిగి రోజా వాహనాన్ని పంపేశారు. రాజధాని ప్రాంతంలో పలు చోట్ల రోజా వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.దాదాపు అరగంట పాటు రోజా వాహనాన్ని అడ్డుకున్నారు రైతులు. జై అమరావతి అనాలని డిమాండ్ చేశారు.
ఈ దశలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైతులపై ఎన్నిసార్లు కేసులు పెడతారు అంటూ పోలీసులను ఆందోళనకారులు ప్రశ్నించారు. అమరావతి కోసం రైతులు ఇఛ్చిన భూముల్లో కొంత సర్కారు ఇళ్ళ స్థలాలకు కేటాయించాలని చూస్తోంది. సర్వేకు వచ్చిన అధికారులను కూడా రైతులు అడ్డుకుంటున్నారు. మాకు న్యాయం చేయకుండా ఇలా చేయటం సరికాదంటూ వాళ్ళు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు.