Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ మంత్రులు..ఎమ్మెల్యేల ‘విచిత్ర రాజకీయం’

వైసీపీ మంత్రులు..ఎమ్మెల్యేల ‘విచిత్ర రాజకీయం’
X

ఎవరైనా రాజధాని మాకొద్దు అంటారా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘రాజధాని వికేంద్రీకరణ’పై నిర్ణయం తీసుకోబోయేది జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, హై పవర్ కమిటీ సిఫారసుల ప్రకారమా?. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్డెక్కి చేసే మూడు రాజధానుల డిమాండ్ పైనా?. నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో ఉన్న మంత్రులు..అధికార పార్టీ ఎమ్మెల్యేలు రోడ్డెక్కాల్సిన అవసరం ఏముంది?. అంటే కేవలం రాజకీయం. టీడీపీ అమరావతికి అనుకూలంగా టీడీపీ ఓ ఉద్యమం నడుపుతుంది. దానికి కౌంటర్ చేయటం కోసమే వైసీపీ మంత్రులు..ఎమ్మెల్యేల మూడు రాజధానులపై రోడ్లెక్కటం. అసలు కారణాలు ఏమైనా పైకి చెప్పేది మాత్రం అభివృద్ధి వికేంద్రీకరణ. మరి ఈ వాదనను ప్రజలు నమ్మటం లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారా?. మంత్రులు..ఎమ్మెల్యేలు పదే పదే ఇదే అంశాన్ని ప్రచారం చేసి మళ్ళీ రోడ్లపైకి రావటం వెనక కారణం ఏంటి?. అసలు నిజంగా వైసీపీ అధికార వికేంద్రీకరణ కోరుకుని ఉంటే ఈ అంశంపై ఆలోచన చేయాల్సింది ఎప్పుడు?. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే. ఆ సమయంలోనే ‘హైదరాబాద్ లో అభివృద్ధి కేంద్రీకరణ’ పై పెద్ద చర్చే నడిచింది.

నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు కాంక్షించే వారు ఎవరైనా విభజన తర్వాత రాజధానిపై నిర్ణయం తీసుకునే సమయంలోనే అభివృద్ధి వికేంద్రీకరణపై మాట్లాడాల్సింది. కానీ వైసీపీ అప్పుడు ఆ పని చేయలేదు. చంద్రబాబునాయుడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా జగన్ కానీ..ఇప్పుడు వికేంద్రీకరణ జపం పటిస్తున్న నాయకులు ఎవరైనా ఆ రోజు దీనిపై మాట్లాడి ఉంటే అసలు టీడీపికి ఇప్పుడు నోరెత్తే ఛాన్సే ఉండేది కాదు. కానీ అప్పుడు వైసీపీ నేతలు ఎవరూ ఆ పని చేయలేదు. పైగా మేం వస్తే అమరావతి మారుస్తామని చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ కీలక నేతలు అందరూ వ్యాఖ్యానించినవారే. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను అధికారంలో ఉండగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళారు. పూలింగ్ లో అక్రమాలు..అవినీతి నిజమే. కానీ జగన్ కూడా పూలింగ్ లో అక్రమాలు..అవినీతి జరిగిందని..నయా జమీందార్ లను సృష్టిస్తున్నారని..అయినా సరే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఇష్టం లేక రాజధాని అమరావతికి ఓకే అంటున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

అమరావతి ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు కానీ..జగన్ మాత్రం కట్టుకున్నారు. దీంతో చాలా వరకూ జగన్ వచ్చినా అమరావతి రాజధాని మార్చరని అక్కడి ప్రజలు విశ్వసించారు. అందుకే గత ఎన్నికల్లో గుంటూరు, కృష్ణా జిల్లాలో ఆ ఫలితాలు. వైసీపీకి ప్రజలు అధికారం అప్పగించారు. ప్రభుత్వం ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఈ రాజకీయ తంతు?. ఏ రాజకీయ నాయకుడు అయినా..ఎమ్మెల్యే అయినా తమ ప్రాంతంలో వచ్చే రాజధాని మాకొద్దు....మేం రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోరుకుంటున్నాం. ఇక్కడ తీసేసి అయినా సరే పక్క వాడికి ఇవ్వండి అని చెప్పే అంత ఉదార స్వభావం ఉన్న వారు ఉంటారా?. సహజంగా అయితే నో అనే చెప్పొచ్చు. కానీ ఏంటి..ఏపీలోని గుంటూరు, కృష్ణా జిల్లా వైసీపీ మంత్రులు..ఎమ్మెల్యేలలను చూడండి. వాళ్లు రోడ్డు ఎక్కి మరీ ఇదే డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి అంతా ఇక్కడే ఎందుకు? రాష్ట్రం అంతటికి పంచండి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు దీని వల్ల పెద్దగా వారికి నష్టం లేకపోయినా రాబోయే రోజుల్లో ఈ ప్రభావం రాజకీయంగా ఖచ్చితంగా వైసీపీపై ఉంటుందని ఆ పార్టీ నేతలే అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.

ఉదాహరణకు టీడీపీ అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతించారు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తమ ప్రాంతానికి వస్తుందని. పార్టీ నిర్ణయానికి విరుద్ధమే అయినా ఇది తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేలు ప్రకటన చేశారు అని చెప్పకతప్పదు. వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యే ప్రభుత్వ నిర్ణయంతో విభేదించకపోవటం వరకూ కొంత వరకూ అర్ధం చేసుకోవచ్చు..కానీ ఇక్కడ ఉన్న సమగ్ర రాజధాని మాకొద్దు అని ‘రోడ్లెక్కి’ ఉద్యమం చేయటమే విచిత్రం అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it