Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ ఫ్యాన్ కు మూడు రెక్కలు..రాష్ట్రం మూడు ముక్కలు

వైసీపీ ఫ్యాన్ కు మూడు రెక్కలు..రాష్ట్రం మూడు ముక్కలు
X

‘వైసీపీ పార్టీ గుర్తు ఫ్యాన్. దానికి మూడు రెక్కలు ఉంటాయి. అందుకే సీఎం జగన్ రాష్ట్రాన్ని కూడా మూడు ముక్కలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఉంది ఆయన తీరు. ఇప్పటికే అభివృద్ధి చెందిన వైజాగ్ ను జగన్ అభివృద్ధి చేసేది ఏముంటుందని ప్రశ్నించారు. అసలు వైజాగ్ లో రాజధాని పెట్టాలని ఎవరు కోరారు’ అని టీడీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆయన గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కన్ను వైజాగ్ పై పడిందని..రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వివిధ దేశాలను పరిశీలించి అమరావతి రాజధానికి రూపకల్పన చేసినట్లు యనమల చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ఎవరికీ అభ్యంతరాలు లేవన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సంపద ముఖ్యమని.. సంపద సృష్టించేందుకు ఐదేళ్ల పాటు కృషి చేశామన్నారు. సంపద సృష్టించే సిటీ ఏపీలో లేదని యనమల స్పష్టం చేశారు. వారి సంపద పెంచుకోవడానికే వైసీపీ నేతలు రాష్ట్రంలో చిచ్చుపెడుతున్నారన్నారు. ధరలు పెరుగుతున్నప్పటికీ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే సంపద ముఖ్యమని యనమల స్పష్టం చేశారు.

ఆదాయం లేకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ఏపీకి ఒక బ్రాండ్‌ క్రియేట్‌ చేశామని.. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి.. మిగతా రాష్ట్రాలకు లాభం చేకూర్చేలా జగన్‌ నిర్ణయం తీసుకున్నారని యనమల విమర్శించారు. తెలంగాణకు హైదరాబాద్‌ ఉందని.. మనకు అలాంటి అవకాశం లేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి విశాఖ డెవలప్‌ జరుగుతూనే ఉందన్నారు. టీడీపీ హయాంలో విశాఖకు చాలా పరిశ్రమలు వచ్చాయన్నారు. అభివృద్ధి చెందుతున్న విశాఖను చెడగొడతారా? అని యనమల ఫైర్ అయ్యారు. ఆర్థిక వృద్ధిరేటు 4 శాతం పడిపోయిందని.. రాష్ట్ర సంపద పెంచే ఆలోచన జగన్‌కు లేదన్నారు. అమరావతి రైతులకు సంబంధించింది మాత్రమే కాదని.. రాజకీయాలు, పరిపాలనను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. రాజధాని తరలింపు వార్తలతో పెట్టుబడులు రావట్లేదని యనమల ఆరోపించారు. వైసీపీ వాళ్లను చూస్తే విశాఖ ప్రజలు భయపడుతున్నారన్నారు. రాజధాని పేరుతో రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. దీని వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బతింటోందని పేర్కొన్నారు.

Next Story
Share it