అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన జగన్
ఏపీలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రవేశపెట్టారు. ‘రాష్ట్ర శాసనమండలిని రద్దు చేసేందుకు శాసనసభ తీర్మానం ప్రవేశపెడుతుంది’ అని జగన్మోహన్ రెడ్డి సభలో తీర్మానం చదివి విన్పించారు.ఆ వెంటనే ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానంపై సభ చర్చకు చేపట్టింది. మండలి రద్దు తీర్మానంపై డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చర్చను ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిని తరలించడం లేదని, మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో భూముల కొనుక్కున్న టీడీపీ నేతలే కావాలని రచ్చ చేస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను నివారించేందుకే మూడు రాజధానులు అని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గం ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసిన అనంతరం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ)ని సమావేశపరిచారు. నాని తర్వాత మండలి రద్దు అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు.
గతంలో ఇదే టీడీపీ రాజ్యసభలో మండలికి వ్యతిరేకంగా మాట్లాడిందని గుర్తు చేశారు. పలువురు ప్రముఖులు ఎగువ సభ గురించి మాట్లాడిన మాటలను దర్మాన ప్రస్తావించారు. ప్రతిపక్ష తెలుగుదేశానికి నిజంగా మండలిపై అంత ప్రేమ ఉంటే సభకు హాజరై తమ వాదన విన్పించవచ్చు కదా? అని ప్రశ్నించారు. టీవీల ముందు చెప్పే మాటలే ఇక్కడి మాట్లాడవచ్చు..కానీ ఎందుకు రాలేకపోయారని ప్రశ్నించారు. అప్పుడు ఓ మాట..ఇప్పుడు ఓ మాట మాట్లాడితే వైసీపీ సభ్యులు ఎండగడతారని..ముఖం చెల్లక సభకు రాకుండా మానుకున్నారని విమర్శించారు. సభ ఈ తీర్మానాన్ని ఆమోదించటం కేవలం లాంచనం మాత్రమే అన్న సంగతి తెలిసిందే.