Telugu Gateway
Andhra Pradesh

కెసీఆర్ తో జగన్ ‘సర్దుబాటు’కు అసలు కారణాలేంటి?

కెసీఆర్ తో జగన్ ‘సర్దుబాటు’కు అసలు కారణాలేంటి?
X

‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయ్యేదా..చచ్చేదా?’ ఇదీ తెలంగాణ సీఎం కెసీఆర్ కొద్ది రోజులు క్రితం విలేకరుల సమావేశంలో బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు. కానీ ఈ జనవరి నుంచి ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిపోయింది. జగన్ సహజంగా తనకు..తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సహించరనే పేరుంది. ఈ విషయం పార్టీలో అందరికీ తెలుసు. అత్యంత కీలకమైన ఆర్టీసీ విలీనాన్ని జగన్ ఎన్ని అవాంతరాలు ఎదురైనా పూర్తి చేశారు. అలాంటిది అవహేళనగా మాట్లాడిన కెసీఆర్ ఇంటికెళ్ళి గంటలకు గంటలు చర్చించటం ఒకెత్తు అయితే..అవమానించిన నేత ఇంటికెళ్ళి ఆయన కాళ్లకు పాదాభివందనం చేసేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నించటం..దీన్ని కెసీఆర్ నివారించటం వైసీపీ వర్గాల్లో కూడా చర్చకు కారణమైంది. ఈ పరిణామాలు ఖచ్చితంగా ప్రజలకు తప్పుడే సంకేతాలు పంపుతాయని వ్యాఖ్యానిస్తున్నారు. విభజన సమస్యలతోపాటు ఏ సమస్యను అయినా ఇద్దరు సీఎంలు సామరస్యంగా పరిష్కరించుకోవటాన్ని అభ్యంతరం చెప్పరు. కానీ అవసరం లేకపోయినా అవమానించిన కెసీఆర్ తో జగన్ ‘సర్దుబాటు’కు కారణాలు ఏంటి అన్నదే ఇప్పుడు వీసీపీ వర్గాల్లో కూడా చర్చకు కారణం అవుతోంది.

ఇదిలా అత్యంత కీలకమైన గోదావరి జలాల వినియోగ అంశం. ఓ వైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి సుమారు అరవై వేల కోట్ల రూపాయలపైబడిన వ్యయంతో సమగ్ర ప్రాజెక్ట నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని ఆదేశించారు. తెలంగాణతో సంబంధం లేకుండా సొంతంగానే గోదావరి జలాల వినియోగ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఎం జగన్ పలు సమీక్షలు కూడా నిర్వహించారు. కానీ సడన్ గా మళ్ళీ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి తెలంగాణతో కలసి ప్రాజెక్టు చేపట్టేందుకు చర్చలు ప్రారంభించినట్లు ప్రకటించారు. అంటే ఈ ప్రాజెక్టు అటకెక్కినట్లేనా?. తెలంగాణ ఆర్టీసీ సమ్మె సమయంలో కెసీఆర్ వైఖరి చూసిన తర్వాత కూడా సీఎం జగన్ మళ్ళీ తెలంగాణతో కలసి లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టు కు చర్చలు ప్రారంభించటం ఏ మాత్రం సరికాదని వైసీపీకి చెందిన కీలక మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ సమ్మె విషయంలో కోర్టులు చేసిన సూచనను కూడా ఆయన ఏ మాత్రం ఖాతరు చేయలేదని..అలాంటిది దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ప్రాజెక్టుల విషయంలో జగన్ ఏకపక్షంగా ముందుకెళితే రాజకీయంగా నష్టం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కెసీఆర్, జగన్ ల భేటీ లు ఎప్పుడు జరిగినా ఇదే విభజనకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై ఇదే సమాచారం బయటకు చెబుతున్నారు తప్ప..ఫలితం మాత్రం ఏమీ ఉండటంలేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కేవలం ఆ అంశాలు చర్చించటానికి ఆరు గంటల సమయం పడుతుందా?. అసలు విషయం వేరే ఉందని ఓ నేత వ్యాఖ్యానించారు. సహజంగా లోపల జరిగేది వేరు..బయటకు వచ్చేది వేరు. బయటకు చెప్పని అంశాలే చర్చల్లో కీలక పాత్రలు పోషిస్తాయనే విషయం అందరకీ తెలిసిందే.

Next Story
Share it