తప్పు చేశారు కాబట్టే వైసీపీ నేతలు భయపడుతున్నారు
ఏపీ రాజధాని అంశంపై కేంద్రం దృష్టి సారించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. రాజధాని కోసం రైతులు ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇవ్వటం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాజధాని రైతుల పట్ల అందరికీ సానుభూతి ఉందని..వారికి న్యాయం జరిగే వరకూ జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా పోలీసు పహరాలో ఎందుకు తిరగాల్సి వస్తోందని ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే ప్రజలకు భయపడుతున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం నాడు అమరావతిలో రాజధాని రైతులతో సమావేశం అయ్యారు. కేంద్రం స్పందించే పరిస్థితులు కల్పిస్తామన్నారు. తాము భూములు ఇఛ్చిన రైతులకు మద్దతు పలుకుతున్నామంటే మిగిలిన ప్రాంతాలకు వ్యతిరేకం అన్నట్లు కాదని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజధాని సమస్య ఏ ఒక్కరిదో కాదని..లక్ష మంది సమస్య అని పేర్కొన్నారు. మహిళలపై పోలీసులా లాఠీచార్జి..దాడులు ఏ మాత్రం సరికాదన్నారు.
ఈ పరిణామాలు బాధిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చే సమయంలో తాను అనుమానాలు వ్యక్తం చేశానని..అయితే సీఆర్ డీఏ చట్టం ఉంది అని అప్పుడు భయం లేదని చెప్పారన్నారు. గతంలో అమరావతికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం, ప్రతిపక్షం అంగీకరించందని, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా వచ్చారని తెలిపారు. ఏ ప్రాంతం వారు కూడా అమరావతిలో రాజధానిని వ్యతిరేకించలేదన్నారు. ఎవరైనా అభ్యంతరం చెప్పి ఉంటే అప్పుడు రైతుల కూడా భూమి ఇచ్చి ఉండేవారు కాదన్నారు. రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేయాలనుకుంటే సర్కారుకు భూములు ఎందుకు ఇస్తారు..వాళ్ళు సొంతంగా చేసుకోలేరా? అని ప్రశ్నించారు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని పవన్ సూచించారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ ధర్మవరం గ్రామస్తులతో మాట్లాడారు.
పోలీస్ వ్యవస్థ చట్టాన్ని అందరికీ సమంగా వర్తింప చేయాలన్నారు. తాను గొడవలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయనని, సంయమనంతో ముందుకు వెళ్తానని తెలిపారు. వైసీపీ నేతలు అలా బాధ్యతగా ఉంటారో లేదో తెలియదుగానీ, ఓ పార్టీ అధినేతగా తనకు బాధ్యత ఉందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామస్తులతో సమావేశం అయ్యారు. జాతర సందర్భంగా జరిగిన గొడవ, తదనంతరం కేసులతో తాము పడిన ఇబ్బందులను ఆ గ్రామానికి చెందిన మహిళలు పవన్ కళ్యాణ్ కి వివరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "చిన్నపాటి గొడవకు గ్రామంలో మగవాళ్లు చెట్లు, పుట్టలు పట్టుకుని తిరగాల్సి రావడం ఆవేదన కలిగించింది. వెంటనే మా లీగల్ విభాగానికి మీకు అండగా నిలవాలని చెప్పాను. మీకు భరోసా ఇచ్చేందుకు నేనే వచ్చి కూర్చుందాం అనుకున్నా. ఇంకా కేసులు పూర్తిగా పరిష్కారం కాలేదు. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు మీకు అండగా ఉంటాను.