Telugu Gateway
Andhra Pradesh

తమ్మినేని ఆయన్ను మించిపోయేలా ఉన్నారే!

తమ్మినేని ఆయన్ను మించిపోయేలా ఉన్నారే!
X

గతంలో స్పీకర్లు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. ఒకసారి స్పీకర్ గా ఎన్నికైన తర్వాత రాజకీయ వ్యాఖ్యలు చేయటానికి కూడా ఇష్టపడేవారు కాదు. రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండే వారు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య రాష్ట్ర చివరి స్పీకర్ నాదెండ్ల మనోహర్ వరకూ ఈ పద్దతి కొనసాగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తొలి స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు ఎన్నికయ్యారు. ఆయన స్పీకర్ గా ఉంటూ రాజకీయ వ్యాఖ్యలు చేయటంతోపాటు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ తీవ్ర వివాదస్పదం అయ్యారు. దివంగత కోడెల శివప్రసాద్ కెరీర్ లో ఇది మచ్చగానే మిగిలిపోతుందని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ దివంగత కోడెల శివప్రసాద్ కు మించి మరీ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఆయన ఎవరూ ఉచ్చరించలేని భాషలో సైతం టీవీల ముందు చంద్రబాబునుద్దేశించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ గత కొంత కాలంగా ఒంటికాలిపై లేస్తున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేయటం ఒకెత్తు. కానీ స్పీకర్ తమ్మినేని కూడా వాళ్ళ కంటే దారుణంగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆదివారం నాడు తమ్మినేని సీతారామ్ మరోసారి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అవసరమైతే జైలుకు వెళతానని చంద్రబాబు అంటున్నారని ఆయన్ను ఎవరూ ఆపబోమని అన్నారు. తీహారు జైలు ఖాళీగానే ఉందని తమ్మినేని వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల అంశంపై మాట్లాడుతూ ఈ ప్రతిపాదన చేయడానికి దమ్ము ఉండాలన్నారు. విశాఖపట్నంకు కార్యనిర్వాహక రాజదాని ఇవ్వాలా?వద్దా అన్నదానిపై చంద్రబాబు నేరుగా మాట్లాడాలని ఆయన సూచించారు. బోస్టన్ గ్రూప్ కు అబద్దాలు చెప్పవలసిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అబద్దాలు చెప్పే చంద్రబాబు కు అందరి మాటలు అబద్దాలుగానే కనిపిస్తాయని సీతారామ్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it