ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం స్టే
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్న తరుణంలో ఊహించని బ్రేక్. సుప్రీంకోర్టు ఈ ఎన్నికలను నాలుగు వారాల పాటు నిలిపివేసింది.ఈ లోగా హైకోర్టులో ఉన్న పిటీషన్లను పరిష్కరించాలని సుప్రీం ఆదేశించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల జీవోపై సుప్రీం కోర్టు బుధవారం స్టే విధించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్‌పై 4 వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని ఏపీ హైకోర్టుకు సూచిస్తూ...అంతవరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది.
వాస్తవానికి ఈ నెల 17 స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న జారీ చేసిన జీవో 176ని జారీ చేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధన ఉండగా ఏపీ సర్కారు మాత్రం దీన్ని పక్కన పెట్టి ఏకంగా 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 176 జారీ చేసింది. రామాంజనేయులు, ప్రతాప్ రెడ్డిలు దాఖలు చేసిన పిటీషన్లను విచారించిన సుప్రీం తాజా ఆదేశాలు జారీ చేసింది.