స్పీకర్ తమ్మినేని అనూహ్య చర్య..అందరూ షాక్
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనూహ్య చర్య అధికార, విపక్ష సభ్యులను షాక్ కు గురిచేసింది. తీవ్ర ఆగ్రహంతో స్పీకర్ తమ్మినేని తన టేబుల్ పై బలంగా మైక్ ను విసిరికొట్టి బయటకు వెళ్లిపోయారు. అయితే దీనికి టీడీపీ సభ్యుల వైఖరే కారణం అని స్పీకర్ ప్రకటించారు. మంగళవారం నాడు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే..టీడీపీ సభ్యులు జై అమరావతి..జై అమరావతి అంటూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. స్పీకర్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా..సీట్లలో వెళ్లి కూర్చోవాల్సిందిగా ఆదేశించినా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలకు అంతరాయటం కల్పించటంతో మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీరుపై తీవ్ర విమర్శల దాడి చేశారు.
అయినా టీడీపీ సభ్యులు పోడియం దగ్గరే నినాదాలు కొనసాగిస్తూ వచ్చారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, సభను నడపలేనంటూ సీటు నుంచి లేచి వెళ్లిపోయారు. ‘‘ప్లీజ్... ఐ యామ్ సారీ.. ఐ యామ్ ప్రొటెస్టింగ్ ది ఆటిట్యూట్ ఆఫ్ టీడీపీ ఎమ్మెల్యేస్.. నిజంగా మనస్తాపానికి గురవుతున్నా’’అంటూ సభ నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో సభ అంతా ఒకింత షాక్ కు గురైంది. స్పీకర్ సభ్యుల తీరుపై నిరసన ప్రకటించి వాకౌట్ చేయటం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారేమో.