సేవ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలతో ‘నవ నిర్మాణ దీక్షలు’ చేయించారు. ఇప్పుడు కొత్తగా అమరావతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ణ చేయాలని కోరుతున్నారు. దీంతోపాటు సేవ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు శనివారం నాడు గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలోని నిర్వహించిన వర్దంతి కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి కామధేనువు అని..ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ఆశలను నెరవేర్చే కేంద్రంగా అమరావతి తయారయ్యేదని..కానీ జగన్ సర్కారు మాత్రం దీన్ని చంపే ప్రయత్నం చేస్తుందని విమర్శించు. అమరావతి ఇబ్బందుల్లో ఉందని రాష్ట్రమంతా బాధ పడుతోందని...అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడటంలేదని అన్నారు.
ఎన్టీఆర్‌ను తలుచుకోగానే ఓ స్ఫూర్తి వస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళులర్పించారు. తెలుగుజాతి గుర్తించుకొనే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్‌లా నటించే వ్యక్తి మరొకరు పుట్టరన్నారు. టీడీపీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేదల కోసం బతికారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడారని పేర్కొన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, పేదలకు పక్కా గృహాలు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. రాయలసీమను ఆదుకున్న ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని బాబు తెలిపారు. రాజకీయాలంటే పదవుల కోసం కాదని, సేవా భావంతో పనిచేయాలని సూచించారు. సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్లని ఎన్టీఆర్ చెప్పారని గుర్తుచేశారు.