Telugu Gateway
Cinema

‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రివ్యూ

‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రివ్యూ
X

‘మహర్షి’ సినిమా కోసం మహేష్ బాబు రైతులను నమ్ముకున్నారు. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఆర్మీ వంతు. ప్రతి సినిమాకూ ఓ కథ అవసరమే. అందులో తప్పేమీలేకపోయినా..అది చెప్పే విధానంలోనే సినిమా జయాజయాలు ఆధారపడి ఉంటాయి. మరి జోష్ లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ బాబుతో కలసి చేసిన తొలి సినిమానే ఈ ‘సరిలేరు నీకెవ్వరూ’. దేశ రక్షణ కోసం సైనికులు ఎన్నో ప్రతికూలతల మధ్య కూడా సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే అన్ని సౌకర్యాలు అనుభవించే రాజకీయ నాయకులు ఏమి చేస్తున్నారు. అవినీతి, అక్రమాలు. సైన్యం దేశాన్ని రక్షించేది వీరి కోసమేనా?. అవినీతి రాజకీయ నాయకులను కూడా కొన్ని నెలలు సరిహద్దుల్లోకి తీసుకెళ్ళి సైన్యం బాధ్యతలు అప్పగిస్తే తెలుస్తుంది అసలు కష్టం అంటే ఏంటో. ఇదే సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ ద్వారా. ఇక అసలు సినిమా కథ విషయానికి వస్తే జమ్మూకాశ్మీర్ లో బాధ్యతలు నిర్వహించే అజయ్ (మహేష్ బాబు) ఎప్పటికప్పుడు తనకు అప్పగించిన టాస్క్ లను విజయవంతంగా పూర్తి చేస్తుంటాడు. ప్రొఫెసర్ భారతి (విజయ శాంతి) కర్నూలులో పనిచేస్తూ ఉంటుంది.

తన కుటుంబం నుంచి ఇద్దరినీ ఆర్మీకి పంపి..వాళ్లను పొగొట్టుకుంటుంది. భారతి కొడుకు సత్యదేవ్ కూడా అజయ్ టీమ్ లో పనిచేస్తాడు. ఓ ఆపరేషన్ లో ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుంటాడు. చెల్లి పెళ్లి కోసం ఇంటికి తిరిగిరావాల్సిన సమయంలో ఈ పరిస్థితి ఏర్పడటంతో ఆర్మీ అధికారులు ఆయన ఫ్యామిలీకి అండగా ఉండి పెళ్లి జరిపించే బాధ్యతను అజయ్ కు అప్పగిస్తుంది. ఆ పని అజయ్ ఎలా పూర్తి చేశాడు అందులో ఎదురైన ఇబ్బందులు ఏమిటి అన్నదే సినిమా. ఈ పెళ్లి పనులు చూసేందుకు జమ్మూ కాశ్మీర్ నుంచి కర్నూలు వస్తున్న సమయంలో రైలులో జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా రావు రమేష్, రష్మిక, సంగీత, హరితేజలతో కూడిన సన్నివేశాలు సినిమాలో కామెడీని పంచుతాయి. ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడికి ఫైట్స్ విషయంలో బోయపాటి పూనినట్లు కన్పిస్తోంది. ఆర్మీ అధికారిగా మహేష్ బాబు తన పాత్రకు న్యాయం చేసినా ఫైట్ల విషయంలో మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు ఉంటుంది. హీరోయిన్ రష్మిక ‘మీకర్ధమవుతోందా’ అంటూ ఆకట్టుకుంటుంది.

కేవలం రష్మికను హీరో వెంట పడే ఓ అమ్మాయిగానే చూపించే ప్రయత్నం చేశారు తప్ప..పాత్రలో ఎక్కడా బలం ఉండదు. రష్మిక చలాకీగా తన పాత్రకు న్యాయం చేసినా మాట్లాడితే అయామ్ ఇంప్రెస్డ్ అంటూ మహేష్ బాబును కౌగిలించుకోవటం..పదే పదే అవే సీన్లు రిపీటీ కావటం చికాకు తెప్పిస్తాయి. సెకండాఫ్ లో ఎంటర్ అయ్యే వెన్నెల కిషోర్ కూడా నవ్వులు పూయిస్తాడు. దర్శకుడు అనిల్ రావిపూడి కథ కంటే కామెడీనే ఎక్కువ నమ్ముకున్నట్లు కన్పిస్తోంది. ఎఫ్2 లో హానీ ఈజ్ ద బెస్ట్ అన్న డైలాగ్ ను వాడేసిన అనిల్ రావిపూడి.. ఈ సినిమాలో మాత్రం ‘మీకర్ధమవుతోందా’ను వాడేశారు. సుదీర్ఘ కాలం తర్వాత వెండితెరపై మళ్ళీ ఎంట్రీ ఇఛ్చిన విజయశాంతి భారతి పాత్రకు న్యాయం చేశారు. విలన్ ప్రకాష్ రాజ్ ది మాత్రం మరీ రొటీన్ పాత్ర. నిర్మాణపరంగా రిచ్ నెస్ విషయంలో ఎక్కడా రాజీపడకపోయినా ఓవరాల్ గా చూస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ లో ఉన్నంత ‘ఇంటెన్సిటి’ సినిమాలో లేదనే చెప్పాలి.

రేటింగ్.2.5/5

Next Story
Share it