Telugu Gateway
Andhra Pradesh

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఔట్

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఔట్
X

వైసీపీ సర్కారులో తొలి వికెట్ పడింది. అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకోవటం ఒకెత్తు అయితే..తాజాగా ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ ఓ మహిళా ఉద్యోగితో అభ్యంతరకరంగా మాట్లాడిన ఆడియో టేపులు బయటికి వచ్చి పెద్ద దుమారమే రేపాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్ వీబీసీ) ఛైర్మన్ గా ఉన్న పృథ్వీరాజ్ తాజా పరిణామాలతో సర్కారు ప్రతిష్టకు నష్టం చేకూర్చారు. దీంతో సర్కారు కూడా వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా పృథ్వీరాజ్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజీనామా చేయాల్సిందిగా టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఎస్వీబీసీ చైర్మన్ పృథ్విరాజ్ ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడినట్టు కొన్ని ప్రసారమాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు చేశారు. దీనిపై ఎస్వీబీసీ చైర్మన్ స్పందిస్తూ తనపై బురద చల్లేందుకు ఎవరో పనిగట్టుకొని తన స్వరాన్ని అనుకరించి ఆడియో రూపొందించారని టిటిడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి నివేదించారు.

ఈ విషయమై టిటిడి చైర్మన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆడియోలోని వాయిస్ శాంపిల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పూర్తిస్థాయిలో విచారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ముఖ్యమంత్రికి తెలియజేయగా ఆయన దీనిపై స్పందిస్తూ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని శ్రీ పృథ్వీరాజ్ ను టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆదేశించారు.’ అని పేర్కొన్నారు. అధిష్టానం ఆదేశాలతో పృథ్వీ తన పదవికి రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారాన్ని సర్కారు చాలా సీరియస్ గా తీసుకుంది.

Next Story
Share it