ఢిల్లీకి పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అకస్మిక ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఓ వైపు జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్న తరుణంలో ఆయన ఢిల్లీ పర్యటన తలపెట్టారు. సమావేశం మధ్యలో నుంచే ఆయన బయలుదేరి వెళ్లారు. అయితే ఈ పర్యటన ఉద్దేశం కేంద్రంలోని నేతలతో రాజధాని అమరావతి అంశంపై చర్చించేందుకే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఈ అంశాన్ని ఎవరూ ధృవీకరించటేం లేదు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. రాజధాని రైతులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అమరావతి అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. స్వయంగా ప్రధాని మోడీ అమరావతికి శంకుస్థాపన చేయటంతోపాటు రాష్ట్రంలోని అన్ని పార్టీలు అమరావతికి అంగీకరించాయని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ పర్యటనలో ఎవరితో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు..ఎవరెవరి అపాయింట్ మెంట్లు ఖరారు అయ్యాయనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీతో పొత్తుపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం. స్థానిక సంస్థల్లో టీడీపీ పొత్తులు పెట్టుకోవాలని కొందరు నేతలు కోరినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్లే.. వైసీపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయని సమావేశంలో కొందరు నేతలు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. బీజేపీ స్థానికంగా బలంగా లేదని మరికొందరు నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం.