Telugu Gateway
Politics

తెలంగాణలోనూ పార్టీకి కొంత సమయం..పవన్

తెలంగాణలోనూ పార్టీకి కొంత సమయం..పవన్
X

బిజెపితో పొత్తు అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా పార్టీని పట్టాలెక్కించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆయన శనివారం నాడు తెలంగాణకు చెందిన పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బిజెపితో పొత్తు అంశాన్ని ఆయన వారితో ప్రస్తావించారు. అన్ని అంశాలు లోతుగా పరిశీలించిన తర్వాతే పొత్తుపై నిర్ణయం తీసుకున్నట్లు పవన్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని ముఖ్య నాయకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తెలంగాణాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమయం తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇప్పడు పార్టీని తెలంగాణాలో బలోపేతం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించుకుందామని, అర్హులయిన పేర్లను కార్యకర్తలే సూచించాలని కోరారు. కమిటీల ఏర్పాటు కార్యకర్తల అభీష్టం మేరకే జరుగుతుందని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతూ బి.జె.పి.లోని అన్ని స్థాయిల నాయకులతో చాలా లోతైన చర్చలు జరిగిన తరువాతనే తెలుగు రాష్ట్రాలు, మన దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రజల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పొత్తు ఏర్పాటు జరిగినట్లు చెప్పారు.

గత కొన్ని నెలలుగా పొత్తుపై బి.జె.పి. అగ్ర నాయకత్వంతో పలు దఫాలు చర్చలు జరిగాయని చెప్పారు. పొత్తుపై ఇరు పక్షాల నుంచి ఎటువంటి షరతులు లేవని వెల్లడించారు. నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే బి.జె.పి.తో కలసి పనిచేసినట్లు గుర్తుచేశారు. బి.జె.పి. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలపై జనసేన కార్యకర్తలు పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. లేని పక్షంలో అపోహలకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఉదాహరణకు పౌరసత్వ చట్ట సవరణ(సి.ఎ.ఎ.)ను అర్ధం చేసుకోవడంలో చాలామంది కొంత అపోహకు గురవుతున్నారని చెబుతూ ఈ చట్టం వల్ల దేశంలో ఉన్న ఏ ఒక్క ముస్లింకు అపకారం జరగదని చెప్పారు. దీనిపై కూలంకషంగా మాట్లాడుతూ ఈ చట్టం రూపకల్పనకు దారితీసిన దేశ విభజన నాటి పరిస్థితులు, భారత్, పాకిస్థాన్ మధ్య గల ఒప్పందాల గురించి వివరించారు. ఆ నాటి ఒప్పందాలను పొరుగు దేశం అమలు చేయకపోవడం కారణంగా అక్కడి మైనారిటీల రక్షణ కోసం ఈ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చిందని వివరించారు. ఇక నుంచి నెలలో కొన్ని రోజులపాటు తెలంగాణాలో పార్టీ కార్యకలాపాల కోసం సమయాన్ని కేటాయిస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it