పవన్ సినిమాలో నివేదా థామస్..అంజలి!
పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు. మరో వైపు సినిమాలు. ప్రస్తుతం ఆయన ‘పింక్’ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 2న విజయవాడలో నిర్వహించ తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’ వరకూ జనసేన తరపున కార్యక్రమాలు ఏమీ లేవు. ఈ లోగా పవన్ తన షూటింగ్ పనుల్లో బిజీగా ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బాలీవుడ్ లో తెరకెక్కిన ‘పింక్’ సినిమా మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీకపూర్ లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. అయితే హిందీలో ‘తాప్సీ’పోషించిన పాత్రను తెలుగులో నివేదా థామస్ పోషిస్తున్నట్లు సమాచారం. నివేదా తోపాటు మరో కీలక పాత్రలో అంజలి నటిస్తున్నారు. నివేదా, అంజలితోపాటు మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం.
పవన్ కళ్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత నటిస్తున్న ఈ సినిమాకు హైప్ క్రియేట్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ పాల్గొంటున్న షూటింగ్ కు సంబంధించిన పోటోలు..చిన్న చిన్న వీడియోలను వ్యూహాత్మకంగా లీక్ చేస్తున్నట్లు చెబుతున్నారు. సహజంగా షూటింగ్ ల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని అనుమతించరని..కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి కావాలనే వీడియోలు విడుదల చేస్తున్నారని చెబుతున్నారు. పింక్ తర్వాత కూడా పవన్ తన వెసులుబాటు ను బట్టి మరికొన్ని సినిమాలు చేసే అవకాశం ఉందని సమాచారం.