‘మా’లో మళ్ళీ రగడ
టాలీవుడ్ కు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో రగడ ఏ మాత్రం సమసిపోలేదు. కొద్ది రోజుల క్రితం చిరంజీవి సాక్షిగా చెలరేగిన వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లు కన్పించినా మళ్ళీ మా ఎగ్జిక్యూటివ్ సభ్యులు క్రమశిక్షణా సంఘానికి సుదీర్ఘమైన లేఖ విడుదల చేయటం కలకలం రేపుతోంది. ఇందులో మా అధ్యక్షుడు నరేష్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని సభ్యులు ఆరోపించారు. తాజా లేఖతో మా సభ్యుల మధ్య విబేధాలు తారస్థాయికి చేరినట్లు అయింది. ‘మా’ అభివృద్ధికి నరేశ్ అడ్డంకి మారారని, నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు ఈసీ సభ్యులను అవమానపరుస్తున్నారని ఆరోపణలు చేశారు. నరేశ్ లోపాలను ఎత్తి చూపుతూ క్రమశిక్షణా సంఘానికి ఈసీ సభ్యులు 9 పేజీల లేఖ రాశారు.
మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాపై తప్పుడు ఆరోపణలు చేశారని, నిబంధనలు ఉల్లంఘించిన నరేశ్‌పై సభ్యులు సంఘానికి విజ్ఞప్తి చేశారు. నరేష్ నిర్ణయాలతో 'మా' పూర్తిగా భ్రష్టుపట్టి పోతోందని విమర్శించారు. క్రమశిక్షణా సంఘానికి 15 మంది ఈసీ సభ్యులు లేఖ రాశారు. నరేశ్ ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, సభ్యులెవరినీ సంప్రదించకుండానే ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని 9 పేజీల లేఖలో సభ్యులు పేర్కొన్నారు. మరి ఈ వ్యవహారంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ క్రమశిక్షణా మండలి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.