చిరంజీవి ‘హీరోయిజం’ సినిమాల్లోనేనా...సొంత తప్పులు కప్పెట్టాలా?.

టాలీవుడ్ హీరోలు సినిమాల్లో తప్పులపై వీరావేశంగా పోరాటం చేస్తారు. విలన్లను తుక్కురేగ కొడతారు. కానీ సొంత పరిశ్రమలో మాత్రం తమ తప్పులను మాత్రం అలా దాచేసుకుని..బయటకు రాకుండా చూసుకోవాలట. ఎవరైనా తప్పులను ఎత్తిచూపితే మాత్రం వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తారు. తప్పులు లేకుండా చేసుకోవటం ముఖ్యమా?. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవటం ముఖ్యమా?. ‘మా’లో ఎవరు తప్పు చేశారనేది అనే సంగతి పక్కన పెడితే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితమే ‘మా’లోని వివాదాలు బయటకు వచ్చాయి.
మరి సినీ పరిశ్రమకు పెద్దగా ఉన్న చిరంజీవి ఇప్పటివరకూ ఈ తప్పులను సరిదిద్దేందుకు కానీ..సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలకు ఎందుకు చొరవ చూపలేదు అన్నది ఓ ప్రశ్నగా నిలుస్తుంది. కానీ మా లోని వివాదస్పద అంశాలను ప్రస్తావించిన రాజశేఖర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చిరంజీవి చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. వెంటనే మా అధ్యక్షుడు నరేష్ కూడా క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ప్రకటించారు. అంటే వేదిక మీద జరిగిన పరిణామాలు చూస్తే మాత్రం రాజశేఖర్ మాలో జరిగిన తప్పులను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తే వాటిని అడ్డుకున్నట్లే కన్పిస్తోంది.