Telugu Gateway
Politics

కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు

కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులతోపాటు ఎమ్మెల్యేలకు కూడా గట్టి హెచ్చరికలు చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో ఎక్కడైనా సీట్లు ఓడిపోతే సంబంధిత మంత్రుల పదవులు ఊడిపోతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేలకు కూడా కెసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ఓ సారి అభ్యర్ధిని ఖరారు చేసి ప్రకటించిన తర్వాత ఇక అందరూ ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందేనని..వెన్నుపోటు రాజకీయాలను అనుమతించే ప్రశ్నేలేదన్నారు. సీఎం కెసీఆర్ ప్రధాన బాధ్యత మంత్రులపై పెడుతుంటే..కొంత మంది మంత్రులు మాత్రం ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. మరికొంత మంది అయితే ఉమ్మడి బాధ్యత ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. శనివారం నాడు హైదరాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పూర్తిగా మునిసిపల్ ఎన్నికల అంశంపైనే ఫోకస్ పెట్టారు.

ఒక్క మునిసిపాలిటీ, కార్పొరేషన్‌లో ఓడినా మంత్రి పదవులు ఊడతాయని హెచ్చరించారు. టికెట్ల పంపిణీ, రెబల్స్‌ కు బుజ్జగింపుల బాధ్యత ఎమ్మెల్యేలదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. సుమారు రెండున్నర గంటలపాటు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యనేతలకు కేసీఆర్ సలహాలు, సూచనలు ఇచ్చారు. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలుస్తున్నాం. సర్వేలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. బీజేపీ పోటీ అనే అపోహలు వద్దు..మనకు ఎవరితోనూ పోటీ లేదు. నియోజకవర్గాల్లో క్యాడర్‌తో ఎమ్మెల్యేలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలి. పాత కొత్త నాయకులు సమన్వయంతో ఉండాలి. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలి. అవసరం ఉన్న చోట మంత్రులు ప్రచారం చేస్తారు అని సమావేశంలో కేసీఆర్ సూచించారు.

Next Story
Share it