Telugu Gateway
Andhra Pradesh

అమరావతిపై రైతులతో చర్చలు జరపాలి

అమరావతిపై రైతులతో చర్చలు జరపాలి
X

ఏపీ రాజధాని అమరావతి విషయంలో సర్కారు వైఖరిని జనసేన తప్పుపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఆయన గురువారం నాడు అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘అమరావతి సమస్య మీద సర్కారు దిగిరావాలి. రైతులతో చర్చించాలి. వారికి భరోసా కల్పించాలి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లబ్దిపొందాలన్న లక్ష్యంతో మీరు తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ ఖండిస్తోంది. మీ ఆనందం కోసం ఒక ప్రణాళిక లేని నిర్ణయాలు తీసుకుని ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరినీ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ఉపయోగపడుతుందన్న మంచి మనసుతో రైతులు భూములు ఇచ్చారు. వారి త్యాగాన్నిప్రభుత్వం విస్మరించింది. వారిని ఇబ్బందిపెట్టడం సరికాదు. ప్రజా ప్రతినిధులు, మంత్రులు, అధికారులు ప్రజల వద్దకు వెళ్లాలి. మీ పాటికి మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటూ, కమిటీల పేరు చెప్పి నాలుగు గోడల మధ్య తీసుకున్న నిర్ణయాలు ప్రజల మీద రుద్దాలని చూస్తే జనసేన పార్టీ ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. ప్రజల ఇబ్బందులు వినే తీరికలేని జగన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఏం అర్హత ఉంది. అమరావతి పరిరక్షణ కమిటీ బస్సు యాత్రను అడ్డుకోవడాన్ని జనసేన పార్టీ ఖండిస్తుంది.

ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు బాధ్యత గల రాజకీయ పార్టీలుగా ఒక వేదిక మీదకు వచ్చి సమస్య తీవ్రతను ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది. జనసేన పార్టీ మొదటి నుంచి ప్రజా సమస్యల మీద, ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యల మీద స్పందిస్తూనే ఉంది. గతంలో జనసేన పార్టీ ప్రజల తరఫున చేసే పోరాటాలను కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వం అడ్డుకోవాలని చూసింది. విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ అనుమతులు ఇవ్వకుండా ఆపాలని చూశారు. మదనపల్లిలో టమాటా రైతుల కష్టాలు తెలుసుకునేందుకు రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసుకుంటే అడ్డుకోవాలని చూశారు. డిసెంబర్ 31వ తేదీన అమరావతి రైతులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ బయలుదేరితే ప్రతి గ్రామం వద్ద పోలీసులు ముళ్ల కంచెలు వేసి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల్లో మార్పు వచ్చే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే బాధ్యత అందరికీ ఉంది.

ప్రజానీకం తమ కష్టాలను ప్రభుత్వానికి తెలిపేందుకు కనీసం వినతిపత్రం సమర్పించే పరిస్థితులు కూడా లేకపోవడం బాధ కలిగిస్తోంది. పోలీసులు సహనంతో, ఓపికతో వ్యవహరించాలి. అన్నంపెట్టే రైతులను ఇబ్బంది పెట్టవద్దు.’ అని వ్యాఖ్యానించారు. అమ్మ ఒడి పథకంలో పారదర్శకత లోపించిందని మనోహర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రోజుకో మాట మాట్లాడుతూ రోజుకో మాట మారుస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ పథకం వ్యవహారంలో యూటర్న్ లు తీసుకుంటున్నారన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. ఎన్నికల వేళ ప్రతి పిల్లవాడికీ ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు ఒక్క బిడ్డ కే ఇస్తామంటున్నారు. అమ్మ ఒడి లబ్ధి పొందాలంటే విద్యుత్ శాఖ నుంచి లేఖ కావాలంటున్నారు. ప్రజలు దృవీకరణ పత్రాల కోసం పలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడు 65 లక్షల మంది లబ్దిదారులు అని ప్రకటించారు. దాన్ని ఇప్పుడు 43 లక్షలకు పరిమితం చేశారు. అదీ ఎంత మందికి వర్తిస్తుందో అర్ధం కాని పరిస్థితి అని ఆరోపించారు.

Next Story
Share it