‘అమ్మ ఒడి’కి శ్రీకారం చుట్టిన జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అమ్మ ఒడి’ పథకానికి గురువారం నాడు శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ మేనిఫెస్టోలో అమ్మ ఒడి ఒకటి నుంచి పదవ తరగతి వరకూ అని మాత్రమే చెప్పామని..కానీ ఇఫ్పుడు ఇంటర్మీయడియట్ వరకూ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవం సమయంలో జగన్ ఓ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద తల్లులకు ఇఛ్చే 15 వేల రూపాయల్లో వెయ్యి రూపాయలను స్కూళ్లకు ఇవ్వాలని కోరారు. ఈ నిధులను ఆయా పాఠశాలల్లో మౌలికసదుపాయాల కల్పనకు ఉపయోగిస్తామని వెల్లడించారు. అమ్మ ఒడి ప్రారంభోతవ్సం సందర్భంగా జగన్ మాట్లాడుతూ చదువు అనేది పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పేర్కొన్న విద్యను ప్రతీ చిన్నారికి అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు.
ఈ ఏడాది విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నామని.. వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా 75 శాతం అటెండన్స్ ఉంటేనే పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ది చేకూరుతుందని... అర్హత ఉండి లబ్ది పొందని తల్లులు ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోవాలని సీఎం జగన్ విఙ్ఞప్తి చేశారు.అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, ఆయాల జీతాల పెంపు, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మార్పుల గురించి సీఎం జగన్ ప్రజలకు వివరించారు. ఈ పథకం కింద దాదాపు 43 లక్షల మంది తల్లులు, 82 లక్షల మంది పిల్లలకు మేలు చేకూరుతుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా ప్రతీ ఏడాది తల్లుల అకౌంట్‌లో పదిహేను వేలు జమ అవుతాయి. బ్యాంకుల్లో అప్పులు ఉన్నా వాటికి ఈ సొమ్మును ఇతర అప్పుల కింద జమ చేయకుండా బ్యాంకర్లతో మాట్లాడామని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం దిశగా అడుగేస్తున్నామని.. అయితే ఆంగ్ల మాధ్యమంపై ప్రజల ఆకాంక్ష చంద్రబాబుకు, సినిమా యాక్టర్‌కు పట్టడం లేదని సీఎం జగన్ విమర్శించారు.
తెలుగు మీడియం కావాలనే నేతలెవరూ తమ పిల్లలను ఆ మీడియంలో చదివించడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి.. ఆ తర్వాత ఒక్కో తరగతి చొప్పున ప్రవేశపెడుతూ...నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వెల్లడించారు. నాలుగేళ్లలో పిల్లలు బోర్డు పరీక్షలు ఇంగ్లీష్ మీడియంలో రాసే పరిస్థితి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలుగు మీడియం పిల్లలకి కొన్ని ఇబ్బందులు వస్తాయి గనుక.. వాటిని అధిగమించేలా బ్రిడ్జ్ కోర్సులు తీసుకుని వస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల కోసం శిక్షణా కోర్సులు ప్రవేశపెడతామన్నారు. తద్వారా 2040నాటికి మన పిల్లలు ప్రపంచలో ఎక్కడికైనా పోటీ పడగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేగాకుండా తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ చేస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ బడుల్లో సిలబస్ మార్చనున్నామని పేర్కొన్నారు.