జగన్ కు సీబీఐ కోర్టులో మరో ఎదురుదెబ్బ
BY Telugu Gateway24 Jan 2020 5:38 PM IST
X
Telugu Gateway24 Jan 2020 5:38 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునకు న్యాయస్థానం నిరాకరించింది. ఇటీవలే సీబీఐ కేసుల్లోనూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునకు కోర్టు నో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సీఎం జగన్ ఈడీ, సీబీఐ కేసుల విచారణ సందర్భంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేలా అనుమతివ్వాలన్న జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో విచారణను ఎదుర్కొంటున్నారు. తాను సీఎం అయినందున పని ఒత్తిడి పెరిగిందని..తాను కోర్టుకు హాజరైతే ఇబ్బంది ఎదురవుతుందని చెబుతూ గత కొంత కాలంగాజగన్ మినహాయింపులు కోరగా..కోర్టు నో చెప్పింది.
తాజాగా ఈడీ కేసుల నుంచి మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటీషన్ విచారణ సందర్భంగా జగన్ అభ్యర్ధనను ఈడీ తిరస్కరించింది. అదే సమయంలో తీవ్రమైన ఆర్ధిక నేరాల్లో నిందిదుల హాజరు తప్పనిసరి అని కోర్టులో వాదించింది. అయితే ఈ శుక్రవారం నాటి విచారణకు ముందస్తు అనుమతి తీసుకున్న జగన్ హాజరు కాలేదు. కానీ ఈ కేసుల్లో సహ నిందితులుగా ఉన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్తలు శ్యాంప్రసాద్ రెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డి, శ్రీలక్ష్మీ,ఐఏఎస్ లు హాజరయ్యారు.
Next Story