‘మా’లో విభేదాలు..రాజశేఖర్ రాజీనామా కలకలం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. గురువారం నాడు జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ ఈ వివాదాలను మరింత బహిర్గతం చేసింది. ముఖ్యంగా రాజశేఖర్ తీరుపై చిరంజీవి, మోహన్ బాబులు అభ్యంతరం వ్యక్తం చేయటం..అయినా రాజశేఖర్ మాత్రం తాను చెప్పదలచుకున్నది వేదికపై చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తర్వాత రాజశేఖర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చిరంజీవి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ‘మా’ ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే తన రాజీనామాకు ‘మా’ అధ్యక్షుడు నరేశ్ కారణమని, ‘మా’ కొత్త కార్యవర్గం ఎన్నికైనప్పట్నుంచి అతడి తీరు అస్సలు బాగాలేదని స్పష్టం చేశారు.
నరేష్ తో తమకు పొసగడంలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత రాజశేఖర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన అభ్యంతరాలు అన్నీ మా అధ్యక్షుడు నరేష్ వ్యవహారశైలిపైనే తప్ప..చిరంజీవి, మోహన్ బాబులతో తనకు ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. ఇది మధ్య జరిగిన గొడవగా చూపించే ప్రయత్నం చేయవద్దని అన్నారు. తన వల్ల డైరీ ఆవిష్కరణలో జరిగిన సంఘటనకు క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. తనకు చిరంజీవి, మోహన్ బాబులపై అపరిమితమైన గౌరవం ఉందన్నారు.