Telugu Gateway
Andhra Pradesh

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీరానికి దూరంగా ఉండాలి

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీరానికి దూరంగా ఉండాలి
X

విశాఖపట్నానికి సంబంధించిన ప్రతికూలతలతో కూడిన అంశాలు తాము చేసిన సిఫారసుల్లో లేవని..తమ నివేదికలో ఉన్నాయని జీఎన్ రావు తెలిపారు.పరిపాలనా రాజధానికి విశాఖ బెస్ట్ ఆఫ్షన్ అని తాము నివేదించామన్నారు. అయితే అది తీరానికి దూరంగా ఉండాలని..కోర్ సిటీలో ఉండకూడదని చెప్పామన్నారు. విశాఖకు ఉత్తర ప్రాంతంగా ఉన్న చోట..సెక్రటేరియట్‌ పెట్టుకోవచ్చని చెప్పామని, సముద్ర తీరంలో పెట్టమని చెప్పలేదని జీఎన్‌రావు తెలిపారు. విశాఖకు తుఫాన్ల ముప్పు ఉందని, వాతావరణం అనుకూలం కాదని..సముద్రతీరం ప్రమాదకరమని జీఎన్‌రావు కమిటీ అంశాల వారీగా చెప్పింది. తాము చెప్పిన అంశాలకు కట్టుబడి ఉన్నామని.. విశాఖ తీరంలో కీలక విభాగాలు పెట్టాలని చెప్పలేదన్న జీఎన్‌రావు అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ, మచిలీపట్నం, విజయవాడ లాంటి పట్టణాల్లో..వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పామన్నారు. దురదృష్టవశాత్తు కొందరు కావాలనే..తమ వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లంతా రిపోర్టు తయారుచేశారని జీఎన్‌రావు చెప్పారు.

జూన్‌ నెలలో 13 జిల్లాల్లో పర్యటించామన్నారు. విశాఖ తీరంలో ప్రతికూల వాతావరణం ఉన్నమాట వాస్తవమేనని.. అందుకే అక్కడ పెట్టమని చెప్పలేదని అన్నారు. 50 కిలోమీటర్ల దూరంలో పెట్టాలని చెప్పామన్నారు. సముద్ర తీరప్రాంతం కోతకు గురికాకుండా ఎవరూ ఆపలేరన్నారు. హైకోర్టులో 4 జిరాక్స్‌ షాపులు వస్తాయనడం తప్పని జీఎన్‌రావు అన్నారు. రాష్ట్రంలో విశాఖ ఒక్కటే మెట్రోపాలిటన్‌ నగరమని జీఎన్‌రావు వ్యాఖ్యానించారు. 13 జిల్లాలను నాలుగు జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జోన్‌-1గా ఉండాలని చెప్పామన్నారు. విశాఖలో హుద్‌హుద్‌లాంటి తుఫాన్‌ వచ్చింది కదా అంటే.. శ్రీకాకుళంలో కూడా తుఫాన్‌ వచ్చిందని జీఎన్‌రావు అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌కు విశాఖ బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పామని, 3 ప్రాంతాల్లో మూడు రాజధానులు పెట్టాలని ప్రభుత్వానికి చెప్పామని జీఎన్‌రావు పేర్కొన్నారు. తమ కమిటీ నివేదికలను తగలబెట్టడం సరైన చర్య కాదన్నారు.

Next Story
Share it