Telugu Gateway
Andhra Pradesh

అందరికి అమోదయోగ్యంగా రాజధాని ప్రకటన ఉండాలి..పవన్

అందరికి అమోదయోగ్యంగా రాజధాని ప్రకటన ఉండాలి..పవన్
X

వైసీపీ సర్కారు రాజధాని అంశంపై ఇప్పటికైనా దాగుడుమూతలు మానుకుని స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మంత్రులు తలా ఓ ప్రకటన చేసి ఈ వ్యవహారాన్ని మరింత గందరగోళం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల ప్రకటనలను రాష్ట్ర ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసేవిలా ఉన్నాయన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఒకసారి, మూడుచోట్ల రాజధాని ఉంటుందని మరోసారి చెప్పి గందరగోళాన్ని ఇంకాస్త పొడిగించారని విమర్శించారు. అమరావతి భూ సేకరణలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇప్పటికే పలుసార్లు చెప్పారు.ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిపిన వారి వివరాలు గతంలోనే ప్రకటించారు. అధికారం మీ చేతుల్లోనే ఉంది. వారిపై కేసులు నమోదు చేయవచ్చు. కానీ ఎందుకు ప్రకటనలతో కాలం వెళ్లదీస్తున్నారు. చెప్పిన విషయాన్నే పదే పదే చెబుతున్నారు. అప్పుడు రాజధాని కోసం భూములు తీసుకోవద్దని, ఇప్పుడు రాజధాని ఇక్కడే ఉంచాలని అమరావతి రోడ్లపై పవన్ కళ్యాణ్ ఎందుకు తిరుగుతున్నారో తెలియడం లేదని అంటున్న పెద్దలకు ఒక్కటే చెబుతున్నా.

భూములు ఇవ్వబోమని చెప్పిన రైతులపై భూ సేకరణ చట్టం ప్రయోగించవద్దని, బలవంతంగా భూములు సేకరిస్తే ఉద్యమిస్తామని నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాడా..నేడు రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసి రోడ్డున పడిన రైతులకు అండగా నిలుస్తున్నా అని పవన్ కళ్యాణ్ తెలిపారు. నాడు రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. 33000 ఎకరాలు అవసరమా? అని ప్రశ్నించా..ఒక వేళ ప్రభుత్వం మారితే భూములు ఇచ్చిన రైతుల భవిష్యత్తు ఏమిటని భయపడ్డా..అదే ఇప్పుడు నిజమవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధర్మం ఎక్కడో అక్కడ జనసేన పోరాటం ఉంటుందన్న విషయం మీకూ తెలియంది కాదు. జనసేన కోరుకుంటున్నది చాలా విస్పష్టం.. పాలన కేంద్రీకృతం కావాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అటువంటి రాజధానిని జనసేన కోరుకుంటోంది. అటువంటి రాజధానిని మీరు రాయలసీమలో పెడతారో, ఉత్తరాంధ్రలో పెడతారో స్పష్టంగా ప్రకటించండి. అయితే ఆనాడు అమరావతి ఏర్పాటుకు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ రెడ్డి తో సహా సర్వజనులు ఆమోదం తెలిపారు.

ఇప్పుడు మీరు ఏర్పాటుచేయబోయే రాజధాని సర్వజనులకు ఆమోదయోగ్యంగా ఉండాలి. ప్రతిపక్షంతో సహా అందరూ ఆమోదించాలి. అయితే దీనిపై కాలయాపన లేకుండా అధికారికంగా స్పష్టమైన ప్రకటనను జనసేన కోరుతోంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కాలయాపన వాంఛనీయం కాదు. పాలకుల నిర్ణయాల కారణంగా ఇప్పటి రాజధాని త్రిశంకు స్వర్గంగా మారిపోయింది. అన్నిటికీ మించి అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాజదాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గ్యారంటీ ఏమి ఉంటుందని తాను 2015లోనే ప్రశ్నించినట్లు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

Next Story
Share it