Telugu Gateway
Top Stories

భారత్ కు వృద్ధి రేటు షాక్!

భారత్ కు వృద్ధి రేటు షాక్!
X

మాంద్యం ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై బాగానే ప్రభావం చూపించే సూచనలు కన్పిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలకు గండిపడగా..జీఎస్టీతో కూడా కొంత ఇబ్బంది ఎదురైంది. గత కొంత కాలంగా నెలకొన్న మాంద్యం పరిస్థితుల కారణంగా ప్రగతి మందగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును ప్రభుత్వం 5 శాతంగా అంచనా వేయడం కీలకంగా మారింది. కేంద్ర గణాంక కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ముందస్తు అంచనాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) నామమాత్రపు వృద్ధిని నమోదు చేయనుంది. గత ఏడాది వృద్ధి రేటు 6.8 శాతంతో పోలిస్తే 5 శాతం వృద్ధికి పరిమితం కానుందని ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. ఇది 11 ఏళ్ల కనిష‍్టం కావటం విశేషం. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షిక ఆర్థిక వృద్ధి 4.5 శాతానికి తగ్గింది. దీంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చే నెలలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో అదనపు ఆర్థిక ఉద్దీపనలకు అవకాశం ఉందని భావిస్తున్నారు.

వ్యక్తిగత పన్నుల్లో రాయితీలను, గత ఏడాది కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించిన తరువాత మౌలిక సదుపాయాల కోసం ఖర్చులను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు, ఆర్థికవేత్తలు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి క్రమంగా పెరుగుతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. తాజా వృద్ధి సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను , ప్రభుత్వ వ్యయాన్ని ప్రభావితం చేస్తుందని ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీలో ఆర్థికవేత్త ఎన్.ఆర్. భానుమూర్తి వ్యాఖ్యానించారు.అయితే 2020/21 లో వృద్ధి 6 నుంచి 6.5 శాతానికి చేరుకునే అవకాశం ఉందన్నారు.

Next Story
Share it