Telugu Gateway
Cinema

‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ

‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ
X

రవితేజకు ఈ మధ్య జోష్ తగ్గింది. కానీ డిస్కోరాజాతో అభిమానుల నమ్మకాన్ని ఏ మాత్ర వమ్ముచేయనని ధీమాగా ప్రకటించాడు. దర్శకుడు వి ఐ ఆనంద్ కూడా అంతే ధీమాగా రవితేజ టాప్ 5 సినిమాల్లో ఇది నిలుస్తుందని చెప్పారు. సినిమా విడుదలైంది. మరి వీళ్లిద్దరూ చెప్పినట్లే జరిగిందా?. అంటే ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. ఇక సినిమా అసలు విషయంలోకి వస్తే డాన్ గా ఉండే డిస్కో రాజు ఓ సారి లడ్డాఖ్ లో ప్రమాదంలో మరణిస్తాడు. మరణించిన ఆయన బాడీని తీసుకొచ్చి మళ్ళీ ప్రాణం పోయటానికి ప్రయత్నం చేస్తుంది ఓ డాక్టర్ల టీమ్. రకరకాల ప్రయోగాల తర్వాత సక్సెస్ అవుతారు. అయితే డిస్కోరాజును బతికించటం అయితే బతికించారు కానీ..అతనికి గతం ఏమీ గుర్తుండదు. గతం తెలుసుకునేందుకు డిస్కోరాజు చేసే ప్రయత్నాలు ఓ వైపు, ఎలాగైనా తాము బతికించిన డిస్కోరాజును తమ ప్రయోగశాలతో ఓ ప్రయోగానికి పనికొచ్చే ఎలుకలా ఉపయోగించుకోవాలనుకునే వైద్యుల టీమ్ ఏర్పాట్లు. వాళ్లను తప్పించుకుని బయటికి వచ్చిన డిస్కోరాజాకు ఎదురైన పరిస్థితులు ఏమిటి అన్నదే సినిమా.

డిస్కోరాజు 80 ఏళ్ల వయస్సులో చనిపోతే వైద్యులు ఆయనకు ప్రాణం పోసి 30 సంవత్సరాల యువకుడిగా మారుస్తారు. ఆయన కొడుకుకు కూడా అదే వయస్సు ఉంటుంది. రవితేజ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. సినిమాలో ఉండటానికి ముగ్గురు హీరోయిన్లు ఉన్నా ఏ ఒక్కరి పాత్రకు సినిమాలో ప్రాధాన్యత లేదు. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ పాత్రలు అయితే మరీ దారుణం. పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో ఓ మూగ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా అసలు కథ ఇద్దరు గ్యాంగ్ స్టర్ల వార్. కానీ లడఖ్ లో డిస్కోరాజు తనను తన ప్రత్యర్ధి అయిన బాబీ సింహ చంపించటానికి ప్రయత్నించాడని భావిస్తాడు. కానీ డిస్కో రాజు టీమ్ లో ఉన్న సునీల్ ఈ పని చేస్తాడు. క్లైమాక్స్ లో తేలే విషయం ఒకింత ఆసక్తికరంగా ఉంటుంది.

సునీల్ కూడా కొత్త లుక్ లో ఆకట్టుకుంటాడు. డాక్టర్ల బృందంలో ఉన్న తాన్యాహోప్, వెన్నెల కిషోర్ సన్నివేశాలే కాస్త నవ్విస్తాయి. సినిమా ప్రారంభంలో వచ్చే లడ్డాక్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే చనిపోయిన మనిషిని బతికించటం..ఇందుకు అనుసరించే పద్దతులు, మళ్లీ వయస్సును తగ్గించటం వంటి అంశాలు ప్రేక్షకులకు ఎంత వరకూ కనెక్ట్ అవుతాయనేది వేచిచూడాల్సిందే. అయితే సినిమా మొత్తంలో ఎక్కడా జోష్ కన్పించదు. నిర్మాణపరంగా రిచ్ గా ఉన్నా ప్రేక్షకులు సీట్లలో అసహనంతో కూర్చోవాల్సిన పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే ‘డిస్కోరాజా’ సినిమాలో జోష్ లెస్ మూవీ.

రేటింగ్. 2/5

Next Story
Share it