Telugu Gateway
Politics

ఢిల్లీ సీఎం నామినేషన్ కు అధికారుల నో

ఢిల్లీ సీఎం నామినేషన్ కు అధికారుల నో
X

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సోమవారం నాడు విచిత్ర అనుభవం ఎదురైంది. ఆయన నామినేషన్ పత్రాలు తీసుకోవటానికి అధికారులు నిరాకరించారు. దీనికి కారణం అప్పటికే నామినేషన్ల స్వీకరణ సమయం ముగిసిపోవటమే. నిబంధనల ప్రకారం ఎవరైనా మధ్యాహ్నాం మూడు గంటల లోగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలి. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చేరుకోవటంలో జాప్యం జరగటంతో ఈ పరిస్థితి ఎధురైంది. మంగళవారం ఆయన మరోసారి ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫీస్‌కు వెళ్ళి నామినేషన్‌ వేయనున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసేందుకు బయలుదేరుతూ ఆయన భారీ రోడ్‌షో‌లో పాల్గొన్నారు.

తొలుత చారిత్రక వాల్మీకి మందిర్‌లో భగవాన్ వాల్మీకి ఆశీస్సులు తీసుకున్న అనంతరం రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ట్రేట్‌మార్క్ టోపీ, చేతిలో ఆప్ ఐదేళ్ల ప్రోగ్రస్ కార్డును పట్టుకుని కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్, కుమార్తె హర్షిత, కుమారుడు పులకిత్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులు రోడ్‌షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆప్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు. ఈ రోడ్ షోకు జనాలు భారీగా తరలిరావడంతో ఆలస్యం అయింది. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి.

Next Story
Share it