అలా చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న రాజధాని అమరావతిని తరలిస్తే వారు ఎవరైనా కొట్టుకుపోవాల్సిందేనని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతికే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. చంద్రబాబునాయుడు స్వయంగా భోగి మంటల్లో జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను వేసి తగలపెట్టారు. ఈ నివేదికలను తగలపెట్టడంతో పీడ వదిలించుకున్నామని వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉందనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని తెలిపారు. మూడు రాజధానుల అంశంపై రెఫరెండం పెట్టాలని చంద్రబాబు మరోసారి డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి..ప్రజలు వైసీపీని సమర్ధిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వెనకబడి ఉన్నా మూడు కార్యాలయాలు పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందదని అన్నారు.
ప్రస్తుతం ఒక్క పైసా అవసరం లేకుండా అమరావతిలో రాజధాని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలను ఇప్పటికే నిర్మించుకున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో జగన్ సర్కారు తలపెట్టిన మూడు రాజధానుల ప్రతిపాదన చూసి ప్రపంచం నవ్వుకుంటోందని ఎద్దేవా చేశారు. ఇది పిచ్చి ఆలోచన అన్నారు. అమరావతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిని కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. అందుకే పండగకు కూడా దూరంగా ఉన్నట్లు తెలిపారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోరని అన్నారు.