ఏపీని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అమరావతి అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాట్లాడితే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎనిమిది నెలలుగా గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. ఏపీని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.30 రాజధానులు పెట్టడానికి ఏపీ ఏమైనా వాళ్ల అబ్బసొత్తా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి ఏది సెంటర్ పాయింటో జగన్ కు తెలియటం లేదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని తరలిస్తే రైతుకు ఎకరాకు 10 కోట్ల పరిహారం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆఫీసులన్నీ ఒకచోటే ఏర్పాటు చేస్తుంటే.. ఏపీలో మాత్రం మూడు చోట్ల రాజధానులని అంటున్నారని విమర్శించారు. రాజధానిపై వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదన్నారు. మూడు రాజధానులు వద్దని జగన్కు వైసీపీ నేతలు చెప్పాలని కోరారు. అమరావతి రైతులను క్షోభపెట్టి మరోచోట రైతులను ఉద్ధరిస్తారా? అని ప్రశ్నించారు.