Telugu Gateway
Andhra Pradesh

బోస్టన్ ది కూడా మూడు ముక్కలాటేనా?

బోస్టన్ ది కూడా మూడు ముక్కలాటేనా?
X

ప్రభుత్వం రాజధాని మూడు ముక్కలు అంటే..బోస్టన్ కూడా అదే మూడు ముక్కలాటకు ఓకే చెబుతుందా? అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. బోస్టన్ కమిటీ నివేదికపై చంద్రబాబు శనివారం నాడు మీడియాతో మాట్లాడారు. అమరావతి నుంచి రాజధానిని ఎలాగైనా తరలించాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఏమి చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. కమిటీల నివేదికల పేరుతో ప్రజలకు అన్నీ అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుందనే అమరావతిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం, రైతులు ఒఫ్పందం చేసుకుంటే దాన్ని గౌరవించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. సంక్రాంతి భోగి మంటల్లో జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను తగలపెట్టాలని సూచించారు. విశాఖపట్నాన్ని హుద్ హుద్ కు ముందు..ఆ తర్వాత ఎలా మారిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

తాము అభివృద్ధి చేసిన విశాఖనే ఇప్పుడు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని, విమానాశ్రయం భూముల సేకరణకు వైసీపీ నేతలు అడ్డుపడ్డారని ఆరోపించారు. బీసీజీ ఎప్పుడు వేశారు..తల తోక ఉందా?. ఈ కన్సల్టెంట్ కంపెనీ అయినా క్లయింట్‌కు ఏది కావాలంటే అది రాసిస్తుంది.. బీసీజీ గ్రూప్‌ అదే చేసింది. బీసీజీ గ్రూప్‌తో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. రోహిత్‌రెడ్డి చెప్పింది బీసీజీ రాసిచ్చింది. మీకు నచ్చిన విధంగా బీసీజీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికకు విశ్వసనీయత ఉందా?. అజయ్‌ కల్లాం చెప్పింది రాసిచ్చానని జీఎన్‌.రావు చెప్పాడు. తప్పుడు నివేదికలతో ప్రజలను మోసం చేయడం సరికాదు. మూడు రాజధానులు చేయడానికి మీకు హక్కు ఎక్కడిది..?. ఎవర్ని మోసం చేయడానికి హై పవర్ కమిటీ వేశారు..?. బీసీజీ నివేదిక తప్పుల తడక. శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మార్చడానికి మీరెవరు..?. అప్పుడు వైఎస్ జగన్ ఒప్పుకున్నారు. అమరావతి ప్రాంతమే రాజధానికి అనుకూలమని శివరామకృష్ణ కమిటీ చెప్పింది అని తెలిపారు.

Next Story
Share it