రాజధాని రెఫరెండంగా ఎన్నికలు
రాజధాని అమరావతి తరలింపుపై రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళే ధైర్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అలా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిస్తే జగన్ ఎక్కడ రాజధాని పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. తాను ఇంత వరకు ఎవరికీ భయపడలేదని వ్యాఖ్యానించారు. తనకు వయసు అయిపోయిందని మాట్లాడుతున్నారు.. అయితే తానొక్కడినే మీ 151 మంది ఎమ్మెల్యేలకు బుద్ధిచెప్పగలని వైసీపీని ఉద్దేశించి అన్నారు. మచిలీపట్నంలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సభ చంద్రబాబు మాట్లాడారు. ఎప్పుడూ ఇంట్లోంచి బయటికిరాని మహిళలు.. రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉందని అన్నారు. ఉద్యమానికి మహిళలు ఆభరణాలు విరాళంగా ఇచ్చారని, జోలెపట్టి సైన్యానికి సహాయం అందించిన వ్యక్తి ఎన్టీఆరేనని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. ప్రజలు అనుకుంటే ఏమైనా చేయగలుతారని, ప్రభుత్వం తమాషాలు చేస్తే తగిన బుద్ధి చెబుదామని హెచ్చరించారు. రూట్ మ్యాప్ ఇవ్వలేదని జేఏసీ బస్సుల్ని అడ్డుకున్నారని, మనకు సెక్యూరిటీ ఇవ్వడానికి మన బస్సులు సీజ్ చేశారని మండిపడ్డారు.
వైసీపీ దొంగలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. జనసేనాని పవన్‌కల్యాణ్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ పోరాటాలు చేసి పైకి వచ్చిన వ్యక్తి అని ప్రశంసించారు. వైసీపీ నేతలు దోపిడీలు చేసి పైకి వచ్చారని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను పవన్ నాయుడు అంటున్నారని, మీ కొడాలి నాని ఏమైనా నానిరెడ్డా? అని ప్రశ్నించారు. శుక్రవారం నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులకు సహకరించొద్దని చంద్రబాబు సూచించారు. అమరావతి ఇక్కడే ఉంచే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ స్పందించకపోతే ఆంధ్రుల భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారు. సంపద సృష్టించడం ఎలాగో సీఎం జగన్‌కు ఏం తెలుసా అని నిలదీశారు. సంపద సృష్టించలేడు, నగరాలు నిర్మించలేడు.. డబ్బులు మాత్రం కావాలంటాడని జగన్‌పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కుంభకోణాలు చేసి వేల కోట్లు దోచుకోవడం కాదని, పరిపాలించడం తెలియాలని చంద్రబాబు అన్నారు. హైపవర్ కమిటీకి అసలు పవరే లేదని ఆయన ఎద్దేవాచేశారు.