Telugu Gateway
Andhra Pradesh

జనసేనకు ‘లక్ష్మీనారాయణ’ గుడ్ బై

జనసేనకు ‘లక్ష్మీనారాయణ’ గుడ్ బై
X

గత కొంత కాలంగా జనసేన పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గురువారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. తన జీవితం అంతా ప్రజాసేవకే అంకితం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటించాలని నిర్ణయించటంతోనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పవన్ సినిమాల నిర్ణయంతో ఆయనకు నిలకడలేదని అర్ధం అవుతోందని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో లక్ష్మీనారాయణ వైజాగ్ ఎంపీగా జనసేన తరపున బరిలో నిలచి ఓటమి పాలయ్యారు.

‘విశాఖపట్నం పార్లమెంట్‌ ఎన్నికల్లో నా వెంట నడిచిన ప్రతి కార్యకర్తకి, నాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, వారందరికి మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానుఅని జేడీ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత అప్పుడప్పుడు తప్ప లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా రాజీనామా చేయటంతో జనసేనలో ఆయన ప్రయాణం ముగిసినట్లు అయింది.

Next Story
Share it