Telugu Gateway
Andhra Pradesh

ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా..రాజధాని నిర్మాణమా?

ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా..రాజధాని నిర్మాణమా?
X

అమరావతిలో రాజధాని పేరుతో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారమా?. రాజధాని నిర్మాణమా?. దీన్ని ఎవరైనా రాజధాని నిర్మాణం అంటారా?. అంటూ ఏపీ అసెంబ్లీలో ఆర్ధిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. మరోసారి ఆయన అసెంబ్లీ వేదికగా ఇన్ సైడర్ ట్రేడింగ్ వివరాలను సభలో చదివి విన్పించారు. రాజధాని పేరుతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారని బుగ్గన ఆరోపించారు. రాజధాని ప్రకటన ముందు చంద్రబాబు నాయుడు అక్రమంగా భూములు కొనుగోలు చేసేందుకు తొలుత గుంటూరు, ఆ తరువాత నూజివీడును రాజధానిగా ప్రచారం చేశారని విమర్శలు చేశారు. టీడీపీ నేతలు 4070 ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేసినట్లు మంత్రి సభలో వివరించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో పాటు రాజ్యాంగ్నాన్నీ ఉల్లంఘించారని విమర్శించారు.

‘కంతేరులో హెరిటేజ్‌ పేరుతో 15 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేశారు. తుళ్లూరులో టీడీపీకి చెందిన ముఖ్యనేత దినకర్‌ భూములను కొన్నారు. వేమురి రవికుమార్‌ కుటుంబ సభ్యులుపై కూడా అమరావతి ప్రాంతంలో భూమలు ఉన్నాయి. జీవీఎస్‌ ఆంజనేయులు 40 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. పయ్యవుల కేశవ్‌, ధుళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్‌రావులకూ భూములున్నాయి. యనమల వియ్యంకుడికి తాడికొండలో భూములు ఉన్నాయి. టీడీపీ నేతలకు చెందిన బినామీలు కూడా పెద్ద ఎత్తున భూములు కొనుగోలుకు పాల్పడ్డారు. నారా లోకేష్‌కు చెందిన బినామీలు వందల ఎకరాల్లో భూములు దోచుకున్నారు. బుచ్చయ్య చౌదరి, మురళీమోహన్‌ బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేశారు. లంక భూములు, పోరంబోకు, అసైన్డ్‌ భూముల్లో ప్లాట్లు తీసుకున్నారు. సుజనా చౌదరి, దమ్మలపాటి శ్రీధర్‌లు కూడా అక్రమంగా ప్రభుత్వ భూములను కొన్నారు.

వీరితో పాటు అనేకమంది టీడీపీ నేతలు 40 వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. అమరావతి ప్రాంతంలో 1600 ఎకరాల భూములను 125 ఆర్గనైజేషన్లకు కేటాయించారు. 1300 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎకరాకు రూ.4 కోట్ల చొప్పున ఇచ్చారు. ప్రైవేటు సంస్థలకు మాత్రం ఎకరాకు రూ.50 లక్షల చొప్పున కట్టబెట్టారు. రాజధాని పేరు చెప్పి అన్ని భూములను టీడీపీ నేతలు స్వాహా చేశారు. ఇంత స్కామ్‌లో అమరావతిని రాజధానిగా కట్టాలంటారా?. వ్యాపార ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అమరావతిని చేపట్టారు. అమాయకులను బెదిరించి భూములు లాక్కున్నారని విమర్శించారు.

Next Story
Share it