Telugu Gateway
Politics

జీఎన్ రావు కమిటీ ఇప్పుడు భగవద్గీతా? బొత్స

జీఎన్ రావు కమిటీ ఇప్పుడు భగవద్గీతా? బొత్స
X

జీఎన్ రావు కమిటీ వ్యవహారంపై ఏపీలో ఇప్పుడు రాజకీయ దుమారం సాగుతోంది. కమిటీ నివేదికలో విశాఖపట్నానికి ఉన్న ప్రతికూలతలను జీఎన్ రావు కమిటీ తన నివేదికలో స్పష్టంగా ప్రస్తావించినప్పటికనీ ప్రభుత్వం వీటిని తొక్కిపెట్టిందని మీడియాలో వార్తలు రావటం, తెలుగుదేశం పార్టీ దీనిపై విమర్శలు చేయటంతో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలు చిత్తు కాగితాలు అంటూ తగలపెట్టిన చంద్రబాబునాయుడికి ఇప్పుడు అది భగవద్గీతలా కన్పిస్తుందా? అని ప్రశ్నించారు. యూటర్న్ లు తీసుకోవటంలో చంద్రబాబును మించిన వారు ఎవరూలేదని మండిపడ్డారు.

అన్ని కమిటీ నివేదికలను హై పవర్ కమిటీ పరిశీలించి తుది నివేదికలు ఇచ్చిందని తెలిపారు. తుఫాన్లు వస్తే విశాఖ ఏమైనా కొట్టుకుపోతుందా? అని ప్రశ్నించారు. చెన్నయ్, ముంబయ్ తోపాటు అన్ని ప్రాంతాలకు తుఫాన్ల ముప్పు ఉంటుందని..విశాఖ కంటే అమరావతిలోనే సమస్యలు ఎక్కువని బొత్స వ్యాఖ్యానించారు. ఎల్లో మీడియా అనుకున్నట్లు రాజధాని మార్పు ఆలస్యం కాదని స్పష్టం చేశారు. ఏ అంశంపై కూడా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. అన్ని వర్గాల, ప్రాంతాల శ్రేయస్సు కోసమే వికేంద్రీకరణ బిల్లును తీసుకువచ్చామని చెప్పారు. శాసన మండలి రద్దుకు రాజధానికి సంబంధం లేదన్నారు. ప్రభుత్వం మీద మాట్లాడడానికి ఏమి లేకపోవడంతోనే రాజధాని అంశంపై వివాదం చేస్తున్నారని ఆరోపించారు.

Next Story
Share it