Telugu Gateway
Andhra Pradesh

‘హుద్ హుద్’ను దాచేసిన బోస్టన్ కన్సల్టింగ్ నివేదిక!

‘హుద్ హుద్’ను దాచేసిన బోస్టన్ కన్సల్టింగ్ నివేదిక!
X

‘అమరావతి ప్రాంతానికి 2009లో వరద వచ్చింది’. అందుకే ఇది రాజధానికి ఏ మాత్రం అనువైన ప్రాంతం కాదు. ఓకే. అదే నిజం అనుకుందాం. మరి 2014 అక్టోబర్ లో విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసిన ‘హుద్ హుద్’ తుఫాన్ ను బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఎలా విస్మరించింది. విశాఖపట్నానికే ఎయిర్ కనెక్టివిటి బాగుందని..అంతర్జాతీయ ప్రయాణికులు అక్కడే ఎక్కువ ఉన్నారని తెలిపింది. హుద్ హుద్ తుఫాను సమయంలో విశాఖపట్నం విమానాశ్రయం పైకప్పు ఎగిరిపోయిన అంశాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. తుఫాన్లు, భారీ వర్షాలు వచ్చిన సమయంలో అసలు విశాఖపట్నం విమానాశ్రయంలో విమానాలు కూడా ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉండదు. మరి ఇంతటి కీలక అంశాలను అంతర్జాతీయంగా పేరొందిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్( బీసీజీ) ఎలా విస్మరించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రారంభించి అది టేకాఫ్ కావాలంటే తక్కువలో తక్కువ మూడేళ్లకుపైగానే సమయం పడుతుంది. అప్పటివరకూ విశాఖపట్నం విమానాశ్రయంపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇది ఒకెత్తు అయితే ఏపీకి రాజధానిగా వైజాగ్ ప్రాంతం మారితే రక్షణ పరంగా వైజాగ్ అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారుతుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సముద్రతీర ప్రాంతం ఉన్న చోట్లే తీవ్రవాద గ్రూపులు ఆయా ప్రాంతాల్లో తేలిగ్గా చొరబడే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. తుఫాన్ల సమయంలో అమరావతితో పోలితే విశాఖపట్నంలోనే ఎక్కువ సమస్యలు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇప్పటికే భూసేకరణ పూర్తయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రారంభించాలి. అరకులో పర్యాటకాన్ని ప్రోత్సహించాలి వంటి సూచనలు చేయటం కామోడీగా ఉందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఇదంతా ఒకెత్తు అయితే ఇఫ్పటికే అమరావతి ప్రాంతంలో భవనాలు, రోడ్లతో పాటు ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనల కోసం చేసిన ఖర్చు కూడా కలుపుకుంటే గత ప్రభుత్వం దాదాపు పది వేల కోట్ల రూపాయల వరకూ వ్యయం చేసింది. రాజధాని కోసం భూములు ఇఛ్చిన రైతులకు కమర్షియల్ ప్లాట్స్ డెవలప్ మెంట్ చేసి ఇవ్వాలంటే దీనిపైన కూడా వేల కోట్ల రూపాయల వ్యయం చేయాల్సి ఉంటుంది.

కాకపోతే అసలు అక్కడ రాజధానే రానప్పుడు కమర్షియల్ ప్లాట్స్ కు విలువ ఎలా వస్తుంది?. దాని వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది?. ఏమీ రానప్పుడు మళ్ళీ వేల కోట్ల రూపాయల వ్యయం చేయటం వల్ల ప్రయోజనం ఏముటుంది?. ఓ వైపు రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉందని చెబుతూ ఇప్పటికే ఖర్చు పెట్టిన పది వేల కోట్ల రూపాయలను వృధా చేయటంతోపాటు రైతులను ఒఫ్పించేందుకు లేదా వారికి ప్యాకేజీ ఇవ్వాలన్నా కూడా సర్కారు భారీ ఎత్తున వ్యయం చేయాల్సి ఉంటుంది. ‘అమరావతి’లో రాజధాని ఉంచటం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే ఆయన తన నిర్ణయాలను కమిటీల ద్వారా తెప్పించి తాను అనుకున్నట్లుగా ముందుకెళుతున్నారని..ఈ కమిటీల నివేదిక చూస్తేనే అసలు విషయం తేలిపోతుందని’ ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it