Telugu Gateway
Andhra Pradesh

బోస్టన్ నివేదిక....సర్కారు డేటాతో సర్కారుకే నివేదిక!

బోస్టన్ నివేదిక....సర్కారు డేటాతో సర్కారుకే నివేదిక!
X

ఏపీ సర్కారు నియమించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక చూస్తే కాసేపు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ నివేదికలోని అంశాలు సర్కారు దగ్గర సమాచారం తీసుకుని మళ్ళీ సర్కారుకే ఓ కొత్త అట్ట వేసి ఇచ్చినట్లు ఉన్నాయని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఓ నాలుగైదు కొత్త అంశాలను అందులో నామమాత్రంగా ప్రస్తావించారు తప్ప..అందులో కొత్తగా చెప్పిన విషయాలు ఏమీ లేవు. రాజధాని విషయంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో అదే బోస్టన్ కూడా చెప్పింది. కాకపోతే జీఎన్ రావు కమిటీ నివేదికలోని అంశాలను కాస్తా అటూ ఇటూగా మార్చింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మెడికల్ హబ్ టూరిజం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, బోగాపురం ఎయిర్‌పోర్టు, పసుపు, కాఫీ పంటలు, అరకు లోయలో ఎకో అడ్వెంచర్‌ టూరిజం అభివృద్ధి చేయాలి. ఈ అంశాలు చెప్పటానికి అంతర్జాతీయ సంస్థ బోస్టన్ కన్సల్టెన్సీ కావాలా?.

ఇవన్నీ పాత ప్రతిపాదనలే. పైగా కృష్ణా జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలంట. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే కృష్ణా, గుంటూరు జిల్లాలు విద్యా కేంద్రాలుగా విలసిల్లాయి. ఇప్పుడు కొత్తగా చేసేది ఏముంది?. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2.2 లక్షల కోట్ల అప్పు ఉంది. కాబట్టి అమరావతిపై లక్ష కోట్ల రూపాయలుపెట్టి అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని తేల్చింది ఈ గ్రూప్. బోస్టన్ నివేదికలోని ఇతర అంశాలు.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఈ అంశం కూడా ప్రభుత్వ లెక్కల ఆధారంగా సిద్ధం చేసిందే. కృష్ణా, గోదావరి బేసిన్‌లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి(వెస్ట్ గోదావరి, కృష్ణా) ఎక్కువగా ఉంది. ఎయిర్‌పోర్టు, పోర్టు విషయంలో విశాఖ తప్ప ఎక్కడా అంతగా అభివృద్ధి చెందలేదు. చేపల ఉత్పత్తి(60 శాతం) రెండు జిల్లాలోనే అధికంగా ఉంది. రాష్ట్రంలో మహిళా అక్షరాస్యతా రేటు తక్కువగా ఉంది. ఎనిమిది జిల్లాల్లో ఇండస్ట్రియల్ ఏరియా తక్కువగా ఉంది. పర్యాటకంలో గత రెండేళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు.

గోదావరి డెల్టాలో పెట్రోకెమికల్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పోలవరం ప్రాజెక్టు, రోడ్‌ కనెక్టివిటీ, హార్టికల్చర్‌, కోనసీమ అభివృద్ధి చేయాలి. కృష్ణా డెల్టాలో సిరమిక్స్, ఫిషరీస్, ఎడ్యుకేషన్ హబ్, మచిలీపట్నం పోర్టు, హెల్త్‌ హబ్‌ అభివృద్ధి చేయాలి. దక్షిణ ఆంధ్ర.. ఆటోమొబైల్‌ మానిఫాక్చరింగ్‌ , లెదర్ అండ్ ఫిషరీస్ రంగాలపై ఫోకస్ పెట్టాలి. మై పాడు బీచ్‌, గోదావరి- పెన్నా లింకేజీ అభివృద్ధి చేయాలి. ఈస్ట్ రాయలసీమ ఎలక్ట్రానిక్స్‌ మానిఫాక్చరింగ్‌, స్టీలు ప్లాంట్లు, హైటెక్ అగ్రికల్చర్‌, గండికోట, బేలం గుహల మధ్య ఎకో ఎడ్వంచర్‌ సర్క్యూట్‌. ఇందుకోసం ఏడాదికి దాదాపు 8 వేల నుంచి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కర్నూలు, అమరావతి, విశాఖపట్నం రాజధానులుగా అనుకూలం. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని మేలు అని బోస్టన్ కమిటీ సూచించింది. పలు ఆప్షన్ లతో బీసిజీ నివేదిక అందించింది.ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా కార్యదర్శి విజయ్‌కుమార్‌ బోస్టన్ నివేదికలోని అంశాలను మీడియాకు వివరించారు. .

Next Story
Share it