Telugu Gateway
Cinema

‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ

‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ
X

ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే...ఈ సినిమాలో నటించిన హీరోనే ఆ సినిమాకు కథ అందించటం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చాలా అరుదైన విషయమే. అంతే కాదు..కథ అందించి..హీరోగా చేస్తూ..హీరో సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కించారు దీన్ని. నాగశౌర్య, మెహరీన్ తొలిసారిగా ఈ సినిమాలో కలసి నటించారు. చలో తర్వాత ఈ యువ హీరోకు సరైన హిట్ దక్కలేదనే చెప్పాలి. ఇక అశ్వథ్థామ సినిమా అసలు కథ విషయానికి వస్తే కిడ్నాప్ అవుతున్న అమ్మాయిలు అందరూ గర్భవతులు అవుతుంటారు. కానీ అసలు ఏమి జరిగిందో వాళ్ళకు మాత్రం తెలియదు. ఈ అవమానాలు భరించలేక కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడతారు. మరికొంత మంది అలాంటి ప్రయత్నాలు చేస్తారు. స్వయంగా హీరో చెల్లికి కూడా ఇదే సమస్య ఎదురవుతుంది. తాను ఎంతో ప్రేమించే చెల్లికి ఈ పరిస్థితి ఎదురవటానికి కారణం ఏంటి?. దీని వెనక ఎవరు ఉన్నారు. వీళ్ళను హీరో ఎలా బయటకు తీసుకొచ్చాడు అన్నదే సినిమా. ఇంత కాలం కేవలం లవర్ బాయ్ గా సినిమాల్లో కన్పించిన నాగశౌర్య ఈ సినిమాలో మాత్రం డిఫరెంట్ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఈ సినిమా మొత్తాన్ని వన్‌ మ్యాన్‌ షోతో నాగశౌర్య ముందుండి నడిపించాడు. యాక్షన్‌ సీన్స్‌ లోనూ మంచి నటన కనపర్చాడు. సినిమా తొలి అర్థభాగంలో కాస్త క్లాస్‌ లుక్‌లో కనిపించినా.. ఆ తర్వాత పాత్ర పూర్తిగా మారిపోతుంది.

సైకో విలన్‌గా జిష్షు సేన్ గుప్తా ప్రేక్షకులను భయపెట్టిస్తాడు. హీరోయిన్ మెహరీన్ కు ఇందులోనూ ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రే దక్కింది. ఈ సినిమాకు ప్రధాన బలం కథ, కాన్సెప్ట్‌. నాగశౌర్య అందించిన కథను దర్శకుడు రమణ తేజ బాగానే ప్రజంట్ చేశాడు. మనోజ్‌ రెడ్డి కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్‌ అందాలు, యాక్షన్‌ సీన్లలో మనోజ్‌ తన సినిమాటోగ్రఫీతో మైమరిపించాడు. శ్రీచరణ్‌ పాకాల పాటలు పర్వాలేదనిపిస్తాయి. అవి గుర్తుండిపోయే పాటలు మాత్రం కాదనే చెప్పాలి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఈ సినిమాలో పలు పవర్ ఫుల్ డైలాగ్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ఎంతో సీరియస్ గా క్రైమ్ థ్రిల్లర్ మూవీలో క్లైమాక్స్ అత్యంత సాదాసీదాగా ఉండటం ఓ మైనస్ పాయింట్ గా ఉంది. ఓవరాల్ గా చూస్తే ‘అశ్వథ్థామ’తో నాగశౌర్య మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లే.

రేటింగ్.2.25/5



Next Story
Share it