Telugu Gateway
Andhra Pradesh

వైజాగ్ లో సచివాలయ ఉద్యోగులకు 200 గజాలు’

వైజాగ్ లో సచివాలయ ఉద్యోగులకు 200 గజాలు’
X

జగన్ సర్కారు నిర్ణయం!

హైదరాబాద్ నుంచి అమరావతి. అమరావతి నుంచి వైజాగ్. ఐదేళ్లలోనే రెండుసార్లు రాజధాని మార్పులు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందికర పరిణామమే. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లినా చాలా మంది వారాంతాల్లో వచ్చి మళ్లీ సోమవారం అమరావతి వెళ్లిపోయేవారు. కానీ వైజాగ్ కు రాజధాని మారితే ఆ పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అక్కడకు ఫ్యామిలీని షిఫ్ట్ చేయాల్సిందే. ఏ ప్రభుత్వం అయినా విధాన నిర్ణయం తీసుకుని రాజధాని మారిస్తే ఉద్యోగులు చేయగలిగింది ఏమీ ఉండదు. ఉద్యోగం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎక్కడకు రాజధాని మారిస్తే అక్కడకు వెళ్లాల్సిందే. అయితే ఈ మార్పుల వల్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు సహజంగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా అదే పనిలో ఉంది. సచివాలయ ఉద్యోగులతోపాటు హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివెళ్లిన ఉద్యోగులకు వైజాగ్ లో 200 గజాల లెక్కన భూమి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయ. ఈ కారణంగానే ఉద్యోగులు కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను వైజాగ్ కు తరలించటాన్ని పెద్దగా వ్యతిరేకించటం లేదని చెబుతున్నారు. భూమి ఇవ్వటంతో పాటు ఇళ్ళు కట్టుకోవటానికి వడ్డీ రహిత రుణాలు కూడా ఇప్పించాలని ఉద్యోగులు డిమాండ్లు పెడుతున్నారు.

వాస్తవానికి రాజధాని అమరావతే అని భావించిన చాలా మంది ఉద్యోగులు అక్కడే రుణాలు తీసుకుని మరీ ఇళ్ళు, ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. ఈ సంఖ్య భారీగానే ఉంది. అయితే వీరు ఇక్కడ ఇంటి నిర్మాణం తీసుకున్న రుణాలపై వాయిదాలు చెల్లించటం, విశాఖలో మళ్ళీ అద్దె కట్టడం వంటి అంశాలు చాలా ఇబ్బందికరంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు..సర్కారు నిర్ణయం తీసుకున్న రాజధాని తరలింపు నిర్ణయం వల్ల ఉద్యోగులు కొనుగోలు చేసిన ఇళ్ల ధరలు కూడా తగ్గుముఖం పడతాయి. దీంతో వీళ్లు అనేక రకాలుగా నష్టపోవల్సి వస్తోంది. ఈ నష్టాన్ని తగ్గించటంతోపాటు..వాళ్ళలో అసంతృప్తిని తొలగించేందుకు సర్కారు కొత్తగా షిఫ్ట్ అయిన వారందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వటంతో పాటు రుణాల మంజూరుకు సాయం చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అందుకే వీళ్ల దగ్గర నుంచి పెద్దగా వ్యతిరేకత రావటం లేదని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని ప్రకటించినా అది ఏ మాత్రం కార్యరూపం దాల్చలేదు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విశాఖ కేంద్రంగా సచివాలయంతోపాటు ఇతర శాఖలు వైజాగ్ కు తరలించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

Next Story
Share it