Telugu Gateway
Andhra Pradesh

అప్పుల్లో కూరుకుపోయిన ‘అథెనా’పై అంత ప్రేమ ఎందుకో?

అప్పుల్లో కూరుకుపోయిన ‘అథెనా’పై అంత ప్రేమ ఎందుకో?
X

ఓ వైపు ఆర్ టీపీపీ అమ్మేస్తూ..అథెనా కొనుగోలులో మర్మమేంటి?

జగన్ సర్కారు ద్వంద ప్రమాణాల వెనక భారీ గోల్ మాల్!

ఎవరైనా ఓ కంపెనీని కొనుగోలు చేయాలంటే ఆ కంపెనీకి ఉన్న శక్తి ఏంటి?. ఆర్ధికంగా ఆ సంస్థ ఎంత పురిపుష్టంగా ఉంది చూస్తారు. ఇది అత్యంత సాదారణ విషయం. కానీ ఏపీలోని జగన్ సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అసలు ప్రభుత్వం ఎక్కడో చత్తీస్ ఘడ్ లో ఉన్న విద్యుత్ ప్లాంట్ కొనుగోలు చేయాలనే నిర్ణయించటంలోనే ఏ మాత్రం ఔచిత్యంలేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది ఒకెత్తు అయితే..పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అథెనా పవర్ చత్తీస్ ఘడ్ యూనిట్ ను కొనుగోలు చేసేందుకు ఏపీ సర్కారు ఆగమేఘాల మీద రెడీ అవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏథెనా యూనిట్ కొనుగోలుకు జెన్ కోకు గ్రీన్ సిగ్నల్ కూడా వఛ్చింది. అంతే కాదు, ఏథెనా పవర్ ను టేకోవర్ చేసిన తర్వాత ఏకంగా 3.80 రూపాయల లెక్కన డిస్కమ్ లకు విద్యుత్ సరఫరా చేయటానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) చేసుకోవచ్చంటూ ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) ఛైర్మన్ నాగులపల్లి శ్రీకాంత్ జెన్ కోకు అనుమతించారు.

ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ విద్యుత్ శాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉన్న రాయలసీమ థర్మల్ కేంద్రం (ఆర్ టీపీపీ) 1650 మెగావాట్ల సామర్ధ్యం గల థర్మల్ ప్రాజెక్టును ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీకి అమ్మేసేందుకు సన్నాహాలు చేస్తూ..మరో వైపు ఎక్కడో చత్తీస్ ఘడ్ లో ఉన్న ఏథెనా పవర్ పై మక్కువ చూపించటం వెనక కారణాలు ఏమై అయి ఉంటాయా? అన్న చర్చ విద్యుత్ శాఖ వర్గాల్లో జరుగుతోంది. థర్మల్ ప్రాజెక్టులు సర్కారుకు భారంగా మారాయంటూ ఆర్ టీపీపీని అమ్మకానికి పెట్టారు. మరో వైపు ఏథెనా కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంలో ఏ మాత్రం హేతుబద్ధత లేదని అధికారులు చెబుతున్నారు.

అంతే కాదు..పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఏథెనాను గట్టెక్కించేందుకే ప్రభుత్వ పెద్దలు ఈ ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం పవర్ ఎక్జ్చేంజ్ లో అందుబాటులో ఉన్న విద్యుత్ ధర కంటే ఏథెనా పవర్ ప్రాజెక్టు నుంచి సరఫరా చేసే విద్యుత్ యూనిట్ కు ఆఫర్ చేయతలపెట్టిన ధర 3.80 రూపాయల చాలా ఎక్కువ అని..ఒక్క పీక్ డిమాండ్ ఉండే వేసవిలో తప్ప..మిగిలిన అన్నిసీజన్ల లో అంతకంటే చాలా తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏథెనాపై ఇలాగే ముందుకెళితే జెన్ కో అధికారుల మెడకు ఈ వ్యవహారం చుట్టుకోవటం ఖాయం అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it