Telugu Gateway
Andhra Pradesh

జగన్ వచ్చారు..‘ఏథెనా పవర్’ మళ్ళీ వచ్చింది

జగన్ వచ్చారు..‘ఏథెనా పవర్’ మళ్ళీ వచ్చింది
X

చత్తీస్ ఘడ్ లో ‘ఏథెనా’ యూనిట్ కొనుగోలు దిశగా అడుగులు

వైఎస్ హయాంలో ఈ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు

విస్మయం వ్యక్తం చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులు

ఏథెనా పవర్. తీస్థా పవర్. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాగా ప్రచారంలోకి వచ్చిన పేర్లు. ఈ ప్రాజెక్టులపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఇందులో వైఎస్ కుటుంబ సభ్యులకు భారీ ఎత్తున వాటాలు ఉన్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. బొగ్గు గనుల కేటాయింపుల కోసం ఏపీజెన్ కోను కూడా ఏథెనాతో తొలుత భాగస్వామ్యం కుదుర్చి..తర్వాత జెన్ కో రూపాయి పెట్టుబడి పెట్టకుండా వెనక్కి వచ్చేసింది. దీనికి కారణం ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ..బొగ్గు గనుల కేటాయింపు మరింత సులభం అవుతుందనేది అప్పటి ప్లాన్. ఇదంతా గత చరిత్ర. ఇప్పుడు కొత్త విషయం ఏమిటంటే ఏపీ జెన్ కో చత్తీస్ ఘడ్ లోని ఏథెనా చత్తీస్ ఘడ్ కు చెందిన 2X600 మెగావాట్లను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఈ ఏథెనా పవర్ యూనిట్ కొనుగోలు, డిస్కమ్ లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లు కుదుర్చుకునేందుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. ఈ అంశంపై ఏపీ జెన్ కో 2020 జనవరి 18న ఆంధ్రప్రదేశ్ పవర్ కోర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ)కి లేఖ రాసింది. ఈ అంశాలను పరిశీలించిన ఏపీపీసీసీ పలు సూచనలు చేస్తూ జెన్ కోకు మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకుని అంటే జనవరి 21నే లేఖ కూడా రాసింది. ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవటం వెనక మతలబు ఏమిటి?. 2019 ఏప్రిల్ 15 నాటి లోడ్ ఫోర్ కాస్ట్ , రిసోర్స్ ప్లాన్ ప్రకారం 1000 మెగావాట్ల లోడ్ డెఫిసిట్ ఉంటుందని ఏపీఈఆర్ సీ ఆమోదించిందని, ఏపీ జెన్ కో ఈ యూనిట్ ను సేకరించి విద్యుత్ సరఫరా చేస్తే విద్యుత్ కొనుగోలుకు డిస్కమ్ లకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో తెలిపారు. అందుకు కొన్ని షరతులను ప్రస్తావించారు.

ట్రాన్స్ మిషన్ ఛార్జీలతో కలుపుకుని యూనిట్ వ్యయం 3.80 రూపాయలు మించకుండా ఉండాలన్నారు. ఈ విద్యుత్ ను ముఖ్యంగా పరిశ్రమలకు సరఫరా చేయాలని లేదంటే పరిశ్రమలు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు, పునరుద్ధరణకు తోడ్పడేలా ఉండాలన్నారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి టారిఫ్ ను సమీక్షించేందుకు ఏపీఈఆర్ సీలో వెసులుబాటు ఉందని తెలిపారు. కారిడార్ అందుబాటుతో పాటు ఇతర సాంకేతిక అంశాలను జెన్ కో పరిశీలించాలన్నారు. ప్లాంట్ నిర్వహణ, యాజమాన్య (ఓఅండ్ఎం) బాధ్యతపై కూడా స్పష్టత ఉండాలని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా ఖచ్చితంగా ఎప్పటి నుంచి మొదలవుతుంది..ఇందులో విఫలమైతే విధించాల్సిన జరిమానాలు వంటి అంశాలపై కూడా నిర్ణయం తీసుకోవాలి. ఈ అంశాలన్నింటిని పరిశీలించి ఏథెనా చత్తీస్ ఘడ్ యూనిట్ ను సేకరించేందుకు ముందుకెళ్ళొచ్చని సీఎండీ ఏపీ ట్రాన్స్ కో నాగుళ్లపల్లి శ్రీకాంత్ జెన్ కోకు లెటర్ పంపారు.

ఓ వైపు రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని..అవసరం లేకుండానే చంద్రబాబునాయుడి సర్కారు సోలార్ విద్యుత్ సంస్థలతో అడ్డగోలుగా ఒప్పందాలు కుదుర్చుకుందని ఆరోపించిన జగన్ సర్కారు ఎక్కడో చత్తీస్ ఘడ్ లో ఉన్న థర్మల్ ప్రాజెక్టును కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది అన్నది ఇప్పుడు విద్యుత్ శాఖ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వేరే రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులను కొనుగోలు చేసి నిర్వహించటం అంత తేలిగ్గా సాగే వ్యవహారం కాదని చెబుతున్నారు. అయినా ఆర్ధికంగా ఎంతో కష్టాల్లో ఉన్న సర్కారు ఏథెనా చత్తీస్ ఘడ్ విద్యుత్ ప్రాజెక్టుపై ఇంత ప్రేమ చూపించటం వెనక భారీ మతలబులే ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it