Telugu Gateway
Andhra Pradesh

పేదలకు ఉపయోగపడే బిల్లులూ అడ్డుకుంటారా?

పేదలకు ఉపయోగపడే బిల్లులూ అడ్డుకుంటారా?
X

పేద ప్రజలకు ఉపయోగపడే బిల్లులను కూడా మండలిలో అడ్డుకోవటం ఏమిటో అర్ధం కావటంలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మండలిలో బిల్లులు అడ్డుకుంటే ఏమి అవుతుంది..మరోసారి అసెంబ్లీ ఆమోదించి పంపితే మళ్ళీ వాళ్ళు కూడా ఆమోదించాల్సిందేనని వ్యాఖ్యానించారు. అయినా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలను అడ్డుకోవటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన బిల్లును మండలిలో తిరస్కరించారని గుర్తు చేశారు. ఎవరెన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా పేద పిల్లలకు ఈ జగన్‌ మామ తోడుగా ఉంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని రూపొందించిన (ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ) బిల్లుకు శాసన సభ గురువారం ఆమోదం తెలిపింది. అదే విధంగా ఈ బిల్లుకు మండలి చేసిన సవరణలను తిరస్కరించింది.

బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో పేదలకు ఇంగ్లీష్‌ విద్య అవసరం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకువస్తున్నాం. ప్రాథమిక దశ నుంచే ఇంగ్లీషులో చదువుకుంటే.. పై చదువులకు వెళ్లేసరికి మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రైవేటు పాఠశాలల్లో 95 శాతానికి పైగా ఇంగ్లీషు మీడియంలోనే బోధన జరుగుతోంది. కంప్యూటర్‌ భాష కూడా ఇంగ్లీషులోనే ఉంటుంది. ఇంగ్లీషు స్పష్టంగా మాట్లాడగలిగితేనే మెరుగైన జీతాలు వచ్చే పరిస్థితి ఉంది. పేదవాడికి రైట్‌ టు ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.

మధ్యాహ్న భోజన పథకంలో గోరుముద్ద పేరుతో మెనూ తీసుకువచ్చాం. దాదాపు 36 లక్షల మంది విద్యార్థులకు జూన్‌లో విద్యా కానుక కిట్‌ అందిస్తాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పేద విద్యార్థులకు మేలు చేకూర్చే విధంగా రూపొందించిన ఈ బిల్లును గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం విదితమే. శాసనమండలి ఈ బిల్లుకు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ తిరిగి అసెంబ్లీకి పంపగా.. వాటిని తిరస్కరిస్తూ శాసన సభ ఈరోజు బిల్లును ఆమోదించింది.

Next Story
Share it