Telugu Gateway
Andhra Pradesh

అంత ఉబలాటం ఉంటే చంద్రబాబు చేసుకోవచ్చు

అంత ఉబలాటం ఉంటే చంద్రబాబు చేసుకోవచ్చు
X

ఏడు నెలల క్రితం కొలువుదీరిన ప్రభుత్వం ఎందుకు వైదొలగాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన మంగళవారం నాడు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబునాయుడికి అంత ఉబలాటం ఉంటే తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించి మళ్లీ ప్రజా తీర్పుతో రావాలన్నారు. శాసనమండలి రద్దు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని అంబటి వ్యాఖ్యానించారు. నాడు కాంగ్రెస్‌ పార్టీ సీఎంగా వైఎస్సార్‌ శాసనమండలి ఏర్పాటు చేశారని గుర్తు చేసిన అంబటి.. అదే సమయంలో చంద్రబాబు మాట్లాడింది ఎల్లో మీడియా ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. ‘సోమవారం నాడు అసెంబ్లీలో శాసన మండలి రద్దు పై ఒక కీలకమైన తీర్మానం చేశాం. 1983లో నాడు ఎన్టీఆర్‌ తీసుకున్న నిర్ణయమే తిరిగి ఇప్పుడు జగన్ తీసుకున్నారు.

కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా సభకు రాలేదు. ఇది మీ తప్పు కాదా? కౌన్సిల్‌కు శాసన పరిమితులు ఉన్నాయి. వాటిని ధిక్కరిస్తే ఏమి జరుగుతుందో.. నిన్నటి పరిణామాలు నిరూపించాయి. అసెంబ్లీ సాక్షిగా ప్రదర్శించిన చంద్రబాబు నాడు-నేడు మాట్లాడిన వీడియోల ద్వారా ఆయనేంటో రాష్ట్ర ప్రజలకు తెలిసింది. లోకేష్‌ కోసం ఇన్ని ఘోరాలు చేశావు. భవిష్యత్‌లో మరిన్ని ఘోరాలు చేయడానికి వెనకాడవు. సీఎం జగన్‌పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశామని చంద్రబాబు వ్యాఖ్యలు అవాస్తవం. వైఎస్సార్‌ సీపీ విధానాలు అవి కావు’అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Next Story
Share it