Telugu Gateway
Andhra Pradesh

ఆళ్లకు తెలిసిన విషయం జగన్ కు తెలియదా?

ఆళ్లకు తెలిసిన విషయం జగన్ కు తెలియదా?
X

దశాబ్దాల క్రితమే కృష్ణా, గుంటూరు జిల్లాలు అభివృద్ధి చెందాయి. ఈ జిల్లాల తరహాలోనే మిగిలిన జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది అని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇదే నిజం. అదే అనుకుందాం. మరి అమరావతిలో రాజధానికి అంగీకరించినప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆ సంగతి తెలియదా?. కృష్ణా, గుంటూరు జిల్లాలు అభివృద్ధి చెందాయి కాబట్టి రాజదాని ఇక్కడ వద్దు అని అసెంబ్లీలో అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు?. పైగా పాదయాత్ర ద్వారా ఏ నేత తిరగనంతగా జగన్ ఏపీలో పర్యటించారు కదా?. అప్పుడైనా జగన్ కు ఈ విషయం తెలిసి ఉంటుందిగా. ఈ అంశాలన్నింటిని విస్మరించి ఇప్పుడు కొత్త కొత్త అంశాలు తెరపైకి తేవటం వెనక మతలబు ఏమిటి?. కృష్ణా, గుంటూరు జిల్లాలు ఇఫ్పటికే అభివృద్ధిలో చాలా ముందున్నాయి కాబట్టి ..వేరే ప్రాంతంలో రాజధాని పెట్టండి అనే విషయాన్ని జగన్ అదే రోజు అసెంబ్లీలో చెప్పి ఉంటే అమరావతి రైతులు భూములు ఇచ్చే వారు కాదు. ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా?. అప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతికి ఓకే చెప్పి..ఇప్పుడు మాట మార్చిన విషయం ప్రజలు గమనించరా?. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలకు కౌంటర్ గా ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం నాడు మీడియా ముందుకు వచ్చారు.

తన భార్య పేరున టీడీపీ నేతలు ఆరోపించినట్లు భూమి ఉంటే ఆ మొత్తం వాళ్ళకే వెనక్కిస్తానని ప్రకటించారు. ఆళ్ళ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘కర్నూలు, అనంతరం, విజయనగరం, శ్రీకాకుళం వాళ్లకు పాతిక లక్షల రూపాయల విలువైన భూములు అంటే ఏమిటో తెలియదు. రెండు కోట్లు, మూడు కోట్లు అంటే ఏమిటో తెలియదు. అందరం ఒప్పుకోవాలి. 23 జిల్లాలు ఉన్న ఉమ్మడి ఏపీలోనూ కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారా..లేదా? దశాబ్దాల క్రితం నుంచి వీళ్లు ముందు ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలాగా మిగతా జిల్లాలు కూడా సమాంతరంగా ఎదగాల్సిన అవసరం లేదా? చంద్రబాబూ. దైర్యంగా చెప్పు వైజాగ్ కు ఏమీ అవసరం లేదు. ధైర్యంగా చెప్పు రాయలసీమను నేను పట్టించుకోను. నా ఆస్తుల..నా బినామీ ఆస్తుల కాపాడుకోవటానికే నేను రాజధాని కట్టాను అని చెప్పు.’ అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఏపీలో జరుగుతున్నది భూముల రేట్లు పెంచే పంచాయతీయా? లేక రాజధాని అంశమా అన్నది అర్ధం కాకుండా ఉన్నది.

Next Story
Share it