Telugu Gateway
Cinema

‘అల..వైకుంఠపురంలో’ మూవీ రివ్యూ

‘అల..వైకుంఠపురంలో’ మూవీ రివ్యూ
X

పాటలే ఫలితాన్ని ముందే చెప్పేశాయి. అల..వైకుంఠపురములో సినిమాకు సంబంధించి అంచనాలను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది పాటలే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే హిట్. ఇప్పటివరకూ వచ్చిన ఫలితాలు అదే నిరూపించాయి. అల..వైకుంఠపురములో సినిమా మరోసారి ఇదే విషయాన్ని నిరూపించింది. ఊహించినట్లుగానే అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘హ్యాట్రిక్’ హిట్ కొట్టినట్లే. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే ధనవంతుడి పిల్లాడు అయినా పేదింట్లో పెరిగితే ప్రయోజకుడు అవుతాడు. పేదొడి బిడ్డ అయినా డబ్బున్నోడి ఇంట్లో పెరిగితే పనికి రాని వాడు అవుతాడు అన్నదే ఈ సినిమా స్టోరీ లైన్. ఇదే తరహా కథలు పాత సినిమాల్లో ఎన్నోసార్లు చూసినా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన విధానం..సినిమాలో అల్లు అర్జున్, మురళీశర్మ ల నటన సినిమాకు కొత్తదనం తెచ్చిందనే చెప్పాలి. సినిమా ఫస్టాఫ్ అంతా మధ్య తరగతి కుటుంబంలో పెరిగిన అల్లు అర్జున్ పడే ఇబ్బందులను ఆసక్తికరంగా చిత్రీకరించారు. అల్లు అర్జున్, పూజా హెగ్డెల లవ్ ట్రాక్ కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

అల్లు అర్జున్ కొంత కాలం తర్వాత నిజం తెలుసుకుని తన అసలు తండ్రి కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని ‘అల..వైకుంఠపురములో’కి ఎంట్రీ ఇస్తాడు. అక్కడ నుంచి అల్లు అర్జున్ యాక్షన్ ఓ కొత్త రేంజ్ కు వెళుతుంది. అల్లు అర్జున్ తొలిసారి పూర్తి స్థాయి ఎంటర్ టైన్ మెంట్ మూవీలో చేసి ఆకట్టుకున్నాడు. సహజంగా ప్రతి సినిమాలో ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచ్ డైలాగ్ లు ఈ సినిమాలో ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాలో చాలా పాత్రలు ఉన్నా సినిమా అంతా అల్లు అర్జున్, పూజా హెగ్డె, మురళీశర్మల మధ్యే తిరుగుతుంది. వీరి పాత్రల చుట్టూనే సినిమా అంతా తిరుగుతుంది. మరో హీరోయిన్ నివేదా పేతురాజు పాత్రకు సినిమాలో పెద్ద ప్రాధాన్యత లేదు. చాలా రోజుల తర్వాత టబు తెలుగు సినిమాలో మెరిసినా..ఆమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినా..ఉన్నంతలో మాత్రం ఆకట్టుకుంది. సినిమాలో హైలెట్ అంటే కామెడీ, పాటలు, యాక్షన్ సన్నివేశాలు అని చెప్పుకోవచ్చు. సెకండాఫ్ లో సాగదీసిన సన్నివేశాలు కొంత చిరాకు తెప్పిస్తాయి. పాటలు అన్నీ బాగున్నా రాములో..రాములా సాంగ్ థియేటర్ లో కూడా ప్రేక్షకులకు కన్నుల పండుగా నిలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే ‘అల..వైకుంఠపురములో’ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల హ్యాట్రిక్ హిట్ మూవీగా నిలుస్తుంది.

రేటింగ్.3.25/5

Next Story
Share it