జగన్ అసలు ప్లాన్ అదేనా?
అమరావతి విషయంలో జగన్ సడన్ గా యూటర్న్ ఎందుకు తీసుకున్నారు?. హేతుబద్దమైన కారణాలు లేకుండా..అసలు ఏ మాత్రం ఆ ప్రాంతం నుంచి డిమాండ్ లేకపోయినా కూడా ‘విశాఖపట్నాని’కి ఎందుకు రాజధానిని మార్చాలని నిర్ణయించుకున్నారు. అంటే ఇందుకు కారణాలు అన్నీ ‘రాజకీయ కోణం’లోనే అని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముందు ప్రకటించినట్లు అమరావతిలో ఏ మాత్రం డెవలప్ చేసినా ఆ ప్రాంతంలో భారీ ల్యాండ్ బ్యాంకు ఉన్న టీడీపీ నేతలకు మేలు చేసినట్లు అవుతుంది. అంటే ఆర్ధికంగా ప్రత్యర్ధి పార్టీకి మేలు చేసి తాము ఇరకాటంలో పడటం ఎందుకు అన్నది ఓ కారణం. పైగా అమరావతిలో ఏమి అభివృద్ధి చేసినా ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు ఖాతాలోకే వెళుతుందని లెక్క మరోకటి. రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమి సేకరించినందున అక్కడ ఏమి చేసినా రాబోయే రోజుల్లో చంద్రబాబు తాను సేకరించిన భూముల్లోనే ఇది అంతా జరిగింది అని చంద్రబాబు ప్రచారం చేసుకుంటారని.. ఆయన ప్రచారం ముందు తాము నిలబడలేమని భావించే అసలు చంద్రబాబుకు ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
వీటి అన్నింటి కంటే మరో ప్రధాన కారణం ‘రాజకీయం’. ఏపీలో అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని రాజకీయంగా పూర్తిగా తమ వైపు తిప్పుకునేందుకు సీఎం జగన్ ఈ మాస్టర్ స్ట్రోక్ వాడారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతం టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఈ సారి ఆ పార్టీ భారీగా దెబ్బతిన్నది. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాజధాన్ని ఆ ప్రాంతానికి మార్చటం ద్వారా ఆ ప్రాంతంలో రాజకీయంగా వైసీపీని మరింత బలోపేతం చేసుకోవటమే అసలు ప్లాన్ గా చెబుతున్నారు. దీనికి తోడు పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయటం ద్వారా కూడా రాయలసీమలో మరింత కన్సాలిడేషన్ జగన్ వ్యూహంగా ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అదే ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఈ రెండింటిని కలిపితే ఏకంగా 86 సీట్లు అవుతాయి. ఈ రెండు ప్రాంతాల్లో పార్టీ పట్టును పటిష్టం చేసుకోగలిగేతే రాజకీయంగా తమకు తిరుగుండదనే వ్యూహంతో వెళుతున్నారని చెబుతున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నట్లు ప్రకటించినా గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఎవరూ పార్టీకి వ్యతిరేకంగా నోరెత్తటం లేదు. అంతా ఓ వ్యూహం ప్రకారమే ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రతోపాటు మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు ఫలితాలు రాబట్టుకున్నాభవిష్యత్ లో అసలు తమకు తిరుగుండదని వైసీపీ నేతల వ్యూహంగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే రాజధానికి గతంలో మద్దతు ఇచ్చినా..ఇప్పటికే అక్కడ దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినా జగన్ ఈ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.