Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు మళ్ళీ ‘ఎన్టీఆర్ ఫ్యామిలీ’ కార్డు వాడబోతున్నారా?

చంద్రబాబు మళ్ళీ ‘ఎన్టీఆర్ ఫ్యామిలీ’ కార్డు వాడబోతున్నారా?
X

నారా భువనేశ్వరి ఎంట్రీ వెనక మతలబు ఏంటి?

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సడన్ గా నారా భువనేశ్వరిని తెరపైకి తీసుకు రావటానికి కారణం ఏంటి?. నూతన సంవత్సరం తొలి రోజు చంద్రబాబునాయుడు తన భార్య భువనేశ్వరితో కలసి రాజధాని ప్రాంతంలో రైతుల దీక్షలకు సంఘీభావం ప్రకటించనున్నారు. గతంలో ఎప్పుడూ నారా భువనేశ్వరి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. గత ఐదేళ్ళలో అమరావతి శంకుస్థాపన సమయంలో కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు వంటి కార్యక్రమాలకు మినహా ఆమె ఎప్పుడూ రాజకీయ కార్యకలాపాలకు హాజరు కాలేదు. కానీ తొలిసారి నారా భువనేశ్వరిని అమరావతి రైతుల ధర్నా విషయంలో రంగంలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించటం వెనక కారణం ఏంటి అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రాజధాని రైతుల ధర్నాలో ఎక్కువ మంది మహిళలు ఉంటున్నందున భువనేశ్వరిని తీసుకొస్తున్నట్లు చెబుతున్నా...దీని వెనక కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ సాగుతోంది. గత ఐదేళ్ళలో చంద్రబాబు అమరావతిపై భారీ హంగామా అయితే చేశారు కానీ..ఫలితాలు మాత్రం చూపించలేకపోయారు. ఇప్పుడు అందుకు రాజధాని రైతులు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. ఇంకో విచిత్రం ఏమిటంటే రాజధాని తమ ప్రాంతం నుంచి తరలిపోతుందని తెలిసినా గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలకు చీమ కుట్టినట్లు కూడా కన్పించటం లేదు.

ధర్నాలు అయినా..రోడ్డెక్కటం అయినా భూములిచ్చిన ప్రాంతం రైతులు చేస్తున్నారు తప్ప..పెద్దగా వారికి ఇతర ప్రాంతాల నుంచి కానీ..పక్క నియోజకవర్గాల ప్రజల నుంచి కూడా మద్దతు రావటం లేదు. గత ఎన్నికల్లో దారుణ ఓటమి అనంతరం టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైందనే చెప్పాలి. ఓ వైపు ఏ ఎమ్మెల్యే ఎప్పుడు జంప్ అవుతారో తెలియని పరిస్థితి. మరో వైపు నారా లోకేష్ పై పార్టీలో ఉన్న నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ తరుణంలో చంద్రబాబునాయుడు భువనేశ్వరిని తెరపైకి తీసుకొచ్చి మరోసారి ఎన్టీఆర్ ఫ్యామిలీ కార్డును వాడబోతున్నారా? అన్న చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ కార్డు ఇప్పుడు వర్కవుట్ అవుతుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలు ఎన్ని మలుపులు తీసుకుంటాయో వేచిచూడాల్సిందే.;నారా భువనేశ్వరి ఒక్క రోజు వచ్చి అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించినంత మాత్రాన పెద్దగా జరిగే ప్రయోజనం ఏమీ ఉండదని తెలిసిందే. అయినా చంద్రబాబు ఆ పని ఎందుకు చేస్తున్నారన్నదే కీలకంగా మారింది. అదే సమయంలో చంద్రబాబు కనీసం చివరి మూడు సంవత్సరాల్లో అయినా సచివాలయం, అసెంబ్లీల శాశ్వత భవనాలు పూర్తి చేసినా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని టీడీపీ నేతల వాదనగా ఉంది.

Next Story
Share it