Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటే జగన్ సెక్రటేరియట్ ప్రకటన వెనక మతలబేంటి?

టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటే జగన్ సెక్రటేరియట్ ప్రకటన వెనక మతలబేంటి?
X

అమరావతి లో రాజధానిని వైసీపీ వ్యతిరేకించటానికి ప్రధాన కారణాల్లో ఒకటి ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’. రాజధాని ఎక్కడ వస్తుందో ఆ విషయం ముందే తెలుసుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు, మంత్రులు, నేతలు భూములు కొనుగోలు చేశారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. అసెంబ్లీలో కూడా అదే విషయం చెప్పింది. అయితే ఇక్కడ నుంచి రాజధాని మార్చటానికి మాత్రం కారణాలు లక్షల కోట్ల రూపాయలు అవుతాయని..అంత డబ్బు ప్రస్తుతానికి లేదనే సాకును చూపించింది. ఇదంతా ఓకే అనుకుందాం. రాజధాని అమరావతిపై ఎంతో హైప్ చేసినా కూడా అమరావతి ప్రాంతంలో టీడీపీ దారుణ ఓటమిని చవిచూసింది. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ మంగళగిరిలో ఓటమి పాలయ్యారు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రజలకు సౌకర్యంగా ఉండే అంశాలతోపాటు రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. కానీ విచిత్రంగా అత్యంత కీలకమైన పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ పేరును ప్రతిపాదించారు.

తెలుగుదేశం పార్టీ గెలిచిన 23 సీట్లలో ఏకంగా నాలుగు సీట్లు వైజాగ్ నుంచి ఉండటం విశేషం. అంతే కాదు ఈ నాలుగు సీట్లు కూడా విశాఖ నగరానికి ముడిపడి ఉన్నవే కావటం అత్యంత కీలకం. విశాఖపట్నం ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం సౌత్ నుంచి గణేష్ కుమార్ వాసుపల్లి, విశాఖపట్నం సౌత్ నుంచి గంటా శ్రీనివాసరావు,విశాఖపట్నం వెస్ట్ నుంచి గణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓ వైపు అమరావతిని రాజధానిగా చేయటం వల్ల అతి పెద్ద లబ్దిదారులు తెలుగుదేశం నేతలు.వారి బినామీలే అని ఆరోపించే అధికార వైసీపీ ఏకంగా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న వైజాగ్ ను కీలకమైన పరిపాలనా రాజధానికి ఎంచుకోవటం వెనక మతలబు ఏమిటి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభం అయింది. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇంతటి కీలక ప్రతిపాదన చేశారంటే మరి ఇప్పుడు టీడీపీ నేతలు లాభపడరా? అని ఓ కీలక అధికారి వ్యాఖ్యానించారు. పైకి కన్పించే వాటికంటే కన్పించని కారణాలు ఎన్నో ఉంటాయని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it