Telugu Gateway
Politics

అసెంబ్లీ గేటు దగ్గర గవర్నర్ ధర్నా

అసెంబ్లీ గేటు దగ్గర గవర్నర్ ధర్నా
X

పశ్చిమ బెంగాల్ లో సర్కారు వర్సెస్ గవర్నర్ గొడవ కొత్త పీక్ కు వెళ్ళింది. గత కొంత కాలంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ దంకర్ ల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. తాజా పరిణామాలతో ఇవి మరింత పీక్ కు చేరినట్లు అయింది. ఓ రాష్ట్ర గవర్నర్ అసెంబ్లీ గేటు ముందు ధర్నా చేయటం బహుశా దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి కావొచ్చు. తాను వస్తున్నట్లు తెలిసినా అసెంబ్లీలో వివిఐపిలు వెళ్ళే గేటు మూసివేయటాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ గేటు మూసివేసి ఉండటంతో ఆయన కాన్వాయ్ రెండవ గేటు నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించారు. తర్వాత ఆయన అసెంబ్లీ గేటు వద్ద గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌ నిరసనకు దిగారు. అసెంబ్లీ సెక్రటేరియట్‌ ఏడాదంతా పనిచేస్తుందని, అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదంటే సెక్రటేరియట్‌ మూసివేశారని అర్ధం కాదని చెప్పారు.

అసెంబ్లీ గేట్లు ఎందుకు మూసివేశారని ప్రశ్నించిన గవర్నర్‌ అసెంబ్లీ ప్రాంగణంలోనే విలేకరుల సమావేశం నిర్వహించారు. చారిత్రక కట్టడాన్ని సందర్శించి లైబ్రరీని పరిశీలించాలని తాను ఇక్కడకు వచ్చానని అసెంబ్లీ సమావేశాలు జరగని సమయంలోనూ సెక్రటేరియట్‌ అంతా యథావిధిగా పనిచేయాలని చెప్పారు. అసెంబ్లీకి వచ్చి అక్కడి లైబ్రరీని సందర్శిస్తానని స్పీకర్‌ బిమన్‌ బెనర్జీకి బుధవారం తాను లేఖ రాయగా తనను లంచ్‌కు కూడా ఆహ్వానించారని గవర్నర్‌ చెప్పారు. ఇంతలోనే అసెంబ్లీ సమావేశాలను రెండు రోజుల పాటు వాయిదా వేశారని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడితే కార్యాలయాలను మూసివేసి గేట్లకు తాళాలు వేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

Next Story
Share it