Telugu Gateway
Andhra Pradesh

మీ విచారణలకు భయపడం..చంద్రబాబు

మీ విచారణలకు భయపడం..చంద్రబాబు
X

అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై విచారణ జరిపించాలన్న ఏపీ మంత్రివర్గ నిర్ణయంపై ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు స్పందించారు. ‘మీకు చేతనైన విచారణ చేసుకోండి. ఆరు నెలల నుంచే ఇదే మాట చెబుతున్నారు. మేం తప్పేమీ చేయలేదు. చేయం కూడా. రైతుల గురించి మాట్లాడుతుంటే బెదిరిస్తారా?’ అని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని అన్నారు. మూడు రాజధానుల పేరుతో తల, మొండెం, చేతులు వేరు చేస్తారా? అని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్ విభిన్నమైన ఆలోచన అని..అమరావతిలో ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతులు 20,490 మంది ఉన్నారని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో రాజధాని లేకుండా చేసేందుకు కావాల్సినన్ని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాజదాని మార్చే అదికారం మీకు ఎవరు ఇచ్చారు అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. విభజన జరిగినప్పుడు రాజధాని ఎక్కడ ఉండాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాజదాని ఎంపిక శాస్త్రీయంగా చేశాం. అందరికీ సమాన దూరంలో అమోదయోగ్యంగా ఉండేలా అమరావతిని ఎంపిక చేశామని తెలిపారు.

జగన్ సర్కారుకు అమరావతిపై ఎందుకంత అక్కసు అని ప్రశ్నించారు. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన.. ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అని చెప్పుకొచ్చారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడిన మాటలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మంత్రులు రోజుకో మాట మాట్లాడి గందరగోళానికి గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సంపద ఎలా సృష్టించాలో వీళ్లకు తెలుసా?, నా 40 ఏళ్ల అనుభవాన్ని గుర్తు చేస్తున్నారు, అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తే అది రాష్ట్రానికి ఆదాయ మార్గం అవుతుంది. 65శాతం తెలంగాణ ఆదాయం హైదరాబాద్‌ నుంచే వస్తోంది. ముంబై, బెంగళూరు, చెన్నై ఆయా రాష్ట్రాలకు ఆర్థిక వనరులుగా తయారయ్యాయి’ అని చెప్పారు. రాజధానిపై ప్రభుత్వం 7 నెలలుగా మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. 5 కోట్ల మంది ఆంధ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అమరావతిలో 9 వేల కోట్లకుపైగా పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు.

రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తుచేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఆమోదయోగ్యమైన ప్యాకేజీ ఇచ్చినట్లు వెల్లడించారు. రాజధానిలో భూమిలేని వారికి రూ.2500 పెన్షన్‌ కూడా ఇచ్చామన్నారు. ఈ విధానాన్ని ప్రపంచం మొత్తం అధ్యయనం చేసే పరిస్థితి కల్పించినట్లు స్పష్టం చేశారు. ‘డబ్బులు లేకపోతే ఇక్కడే అన్ని సౌకర్యాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇక్కడి నుంచే పాలన చేయొచ్చు కదా?, అసెంబ్లీ లేకపోతే ఎక్కడ సమావేశాలు పెట్టారు?, ఇవాళ కేబినెట్‌ సమావేశం శ్మశానంలో పెట్టారా?, హైదరాబాద్‌లో నా ముద్ర ఉంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ చాలనుకుంటే సైబరాబాద్‌ వచ్చేది కాదు, హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి ఉంది.. ఇక్కడ రైతులు ఉదారంగా ఇచ్చారు’ అని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి డబ్బులేదనటం ఓ నెపం మాత్రమే అన్నారు. నిన్నటి వరకూ అమరావతిలో ఒక సామాజికవర్గం అంటూ మాట్లాడారు. ఇప్పుడు మాత్రం మరో మాట చెబుతున్నారని విమర్శించారు.

Next Story
Share it