వైజాగ్ కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా చంద్రబాబు కుట్ర
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం త్వరలోనే ప్రకటించనుందని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని..ఆయన ప్రయత్నాలను ప్రజలే అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబుకు తానొక్కడినే బాగుపడితే చాలు అన్నభావన ఉంటుందని..కానీ ప్రభుత్వం మాత్రం అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు అందరూ అమరావతిలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని..ఈ డబ్బులను విదేశాలకు తరలించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పరిపాలనకు విశాఖపట్నం ఎంతో అనుకూలంగా ఉందనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని పేర్కొన్నారు.